Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Mother, Motherland, Mother tongue:
కన్నతల్లి, జన్మభూమి స్వర్గంతో సమానమని నాడు వాల్మీకి మహర్షి శ్రీరాముడితో చెప్పించారని, దానికి తాను మాతృభాషను కూడా జోడిస్తానని భారత సుప్రీం కోర్టు ప్రథాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ అన్నారు. తాను ఎన్నో దేశాలు తిరిగానని ‘ సొంత వూరి తొలకరి సుగంధానికి మించిన ఏ సౌందర్యమూ లేద’ని అభిప్రాయపడ్డారు. చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా హోదాలో తొలిసారి తన స్వగ్రామం పొన్నవరం వచ్చిన జస్టిస్ రమణకు గ్రామస్తులతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో రమణ ప్రసంగించారు.

తెలుగు జాతిలో ఎంతో గొప్పవాళ్ళు, కష్టపడే వాళ్ళు ఉన్నారని, అందరూ ఐకమత్యంగా ఉండి సమస్యలపై పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడి నిర్మాణ సంస్థలు దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో రోడ్లు, రహదారి ప్రాజెక్టులు చేపడుతున్నారని, ఆఫ్ఘనిస్తాన్ లో పార్లమెంట్ భవనం కట్టింది కూడా తెలుగు వారేనని, ఇటీవలి కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టిన ఘనత కూడా భారత్ బయోటెక్ సుచిత్ర, కృష్ణా ఎల్లా దంపతులకు దక్కుతుందని వివరించారు. కానీ తెలుగు జాతికి రావాల్సినంత గుర్తింపు రాలేదని అయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషను, సంస్కృతి, సంప్రదాయాలను పటిష్ట పరచుకోవాలని పిలుపు ఇచ్చారు.

తన ఎదుగుదలలో బంధువులు, గ్రామ ప్రజల తోడ్పాటు, ఆశీర్వాదం, మద్దతు, సహకారం ఎంతగానో ఉన్నాయని జస్టిస్ రమణ భావోద్వేగంతో పేర్కొన్నారు. సొంత వూరి ప్రజల ఆశీర్వాదం తీసుకోవడం కోసమే ఇక్కడకు వచ్చానన్నారు. ఈ గ్రామం వదిలి పెట్టి ఎన్నో సంవత్సరాలైనా తన మూలాలు ఇక్కడే ఉన్నాయన్న విషయం ఎప్పుడూ మరవలేదన్నారు. ఇదే వూళ్ళో అరుగుబడిలో చదువుకున్న జ్ఞాపకాలు ఎప్పటికీ తన మదిలో ఉంటాయన్నారు. ఈ ప్రాంతం రాజకీయంగా కూడా ఎంతో చైతన్యవంతమైనదని, అందుకే తనకు రాజకీయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేదన్నారు.  ఈ ప్రాంతం మెట్ట ప్రాంతమని, మంచి నీళ్ళకు ఎంతో ఇబ్బంది ఉండేదని, ఆ తర్వాత నాగార్జున సాగర్ తో కాస్త ఉపశమనం కలిగినా ఇంకా ఇక్కడి చివరి భూములకు సాగునీరు, మంచినీటి సదుపాయం పూర్తి స్థాయిలో లేకపోవడం బాధాకరమన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, పేర్ని నాని, ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్, జిల్లాకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Also Read : మంట కలిసిన మానవత్వం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com