LIFE IS NOT ABOUT FINDING YOURSELF.. LIFE IS ABOUT CREATING YOURSELF.. అంటారు జార్జ్ బెర్నార్డ్ షా.
అందుకే ఇప్పుడు జ్యోతి నైన్వాల్ వార్త వైరల్ అయ్యింది. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ అయ్యారు కాబట్టి! దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భర్త మరణంతో కృంగిపోకుండా.. ఇద్దరు పిల్లల్ని సాకుతూనే… భర్త స్ఫూర్తిని కొనసాగించేందుకు మళ్లీ సైన్యంలో చేరి అసలైన అర్ధాంగి అనిపించుకున్నారు.
ఆరోజు 2018… ఏప్రిల్ 11. ఆపరేషన్ రక్షక్‌లో భాగంగా జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరులో.. మేజర్ దీపక్ నైన్వాల్ తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో 40 రోజుల పాటు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీపక్ బతుకుతాడని, ఇంట్లో దీపం వెలుగుతుందని ఆశించిన జ్యోతి కుటుంబంలో జ్యోతి ఆరిపోయింది. మొత్తం కుటుంబంలోనే తెలియని అయోమయం నెలకొంది. కానీ ఇద్దరు పిల్లలు… కుటుంబ బాధ్యతలు… జ్యోతి తన దుఃఖాన్ని దిగమింగుకున్నారు. భర్త ఆశయ సాధనలో తనవంతు పాత్ర పోషించాలని నిశ్చయించుకున్నారు. ఏ ఆశయంతోనైతే భర్త ఆర్మీలోకి వచ్చారో… భర్త ఆశయం, త్యాగ స్ఫూర్తి, దేశభక్తి నరనరాల్లో రక్తమై ప్రసరిస్తోంది జ్యోతిలో. భర్త వీర మరణాన్ని పంటిబిగువున దాచుకుంటూనే, నెగటివ్ ఆలోచనల నుంచి తనను తాను దూరం చేసుకునేందుకు ఆమె మానసికంగా ఓ యుద్ధమే చేసింది.
ఆ సయమంలో… జ్యోతి తల్లి ఆమెకు కొంతంత అండగా నిలిచి ఆమె ఆలోచనకు మద్దతు పలికారు, మరింత స్పూర్తిని రగిలించారు. ‘నీ జీవితాన్ని నీవెలా నడిపిస్తావో నీ ఇష్టం. కానీ, నీ జీవితాన్నే నీ పిల్లలు అనుసరిస్తుంటారు. నీ జీవిత పాఠం… నీ పిల్లలకు ఓ బహుమతి కావాలే తప్ప.. శాపం కాకూడదు. భవిష్యత్తు అంధకారం అంతకన్నా కాకూడద’న్న తల్లి మాటలు జ్యోతి నైన్వాల్ ను ఆలోచింపజేశాయి. తన భర్త దేశం కోసం ఆర్మీలో చేరారు… అయన బాటలోనే తానూ ఆర్మీలో చేరి దేశం కోసం తనవంతు పాత్ర పోషించాలని తలచారు. ఆ సమయంలో వారి కుటుంబానికి సన్నిహితులైన మహర్ రెజిమెంట్ లోని బ్రిగేడియర్ చీమా, కల్నల్ ఎంపీసింగ్ ఇద్దరూ మార్గదర్శకులై జ్యోతిని ముందుకు నడిపింఛి ఆమెకు బాసటగా నిలిచారు. వారితో పాటే.. రెజిమెంట్ అంతా వారికి అండగా నిల్చింది.
అలా వారి చొరవతో దీపక్ మరణించిన వెంటనే.. ఆమె సాయుధ దళాల అధికారుల కేడర్‌లోకి ప్రవేశించడానికి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ పరీక్షకు సిద్ధమైంది. మొత్తానికి పరీక్షలో ఉత్తీర్ణురాలై.. విజయం సాధించింది. అందులో భాగంగా చెన్నైలో 11 నెలల కఠోర శిక్షణను విజయవంతంగా పూర్తి చేసింది. నాటి దివంగత మేజర్ భార్య, ఓ సాధారణ గృహిణి… ఇప్పుడు ఆర్మీలో లెఫ్టినెంట్ స్థాయి అధికారై.. తన భర్త ఆశయాలను ముందుకు తీసుకెళ్తుంది. అర్ధాంతరంగా వీరమరణం పొందిన భర్త ఆత్మకు శాంతిని చేకూర్చింది. తండ్రి ఆశయంతో భరతమాత సేవకై కవాతు ప్రారంభించిన తమ మాతను చూసిన పిల్లలు తొమ్మిదేళ్ల లావణ్య, ఏడేళ్ల రేయాన్ష్ ఆనందభాష్పాలతో గర్వపడేలా చేసింది. మొదట్లో ఆలోచన రేకెత్తించిన తల్లి మాటలు దీవెనలై… తననుసరించే పిల్లలకు ఓ మార్గదర్శై నిల్చింది. జ్యోతి నైన్వాల్ ఓ పడిలేచిన కెరటం. అందుకే జ్యోతి ఇప్పుడు వార్తల్లో విశిష్ఠ వ్యక్తి.. దేశసేవకై కలలుగనే మరెందరికో స్ఫూర్తి.
– రమణ కొంటికర్ల
Also Read :