Sunday, January 19, 2025
HomeTrending Newsకాబుల్ మసీదులో బాంబు పేలుడు..20 మంది మృతి

కాబుల్ మసీదులో బాంబు పేలుడు..20 మంది మృతి

ఆఫ్గనిస్తాన్‌‌ మరోసారి బాంబు దాడితో దద్దరిల్లింది. కాబూల్‌ శివారు ప్రాంతమైన ఖైర్ ఖానాలోని సిద్ధిఖియా మసీదులో భారీ పేలుడు చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం సమయంలో మత ప్రార్థనలు జరుగుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 20 మంది మృతి చెందగా 40 మంది వరకు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంలో ఈ పేలుడు చోటు చేసుకోవడం గమనార్హం.

పేలుడులో గాయపడినవారికి కాబూల్‌లో ఇటలీ ఎన్జీవో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 27 మందికి చికిత్స అందిస్తున్నట్లు అక్కడి సిబ్బంది వెల్లడించారు. తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహీద్ బాంబు దాడిని ధ్రువీకరించారు. అయితే దాడిలో ఎంతమంది చనిపోయారనేది చెప్పలేదు. దాడికి బాధ్యులైనవారిని త్వరలోనే కఠినంగా శిక్షిస్తామన్నారు.

మసీదులో పేలుడు ధాటికి సమీపంలోని భవనాల కిటికీలు కూడా ధ్వంసమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాంబు దాడిలో మసీదు ఇమామ్ ముల్లా అమీర్ మహమ్మద్ కాబూలీ కూడా మృతి చెందినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇంటలిజెన్స్ టీమ్స్ బాంబు దాడికి సంబంధించిన క్లూస్‌ను సేకరించే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ దాడికి ఎవరు పాల్పడ్డారన్న వివరాలు తెలియదు. ఏ ఉగ్రసంస్థ కూడా దీనిపై ప్రకటన చేయలేదు. ఐతే దీని వెనక ఆఫ్ఘనిస్థాన్‌లో పనిచేస్తున్న ఇస్లామిక్ స్టేట్ హస్తం ఉండవచ్చని భావిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్