Kavitha Filed Nomination For Mlc Post :
స్థానిక సంస్థల బలోపేతం కోసమే మళ్ళీ బరిలోకి దిగినట్లు శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా కవిత నేడు నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, షకీల్ అహ్మద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోసారి తనకు పోటీచేసే అవకాశం కల్పించిన టిఆర్ఎస్ అధ్యక్షుడు, సిఎం కేసియార్ కు కవిత ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ గతంలో పార్టీ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేశానని, సంవత్సరకాలంగా స్థానిక సంస్థల బలోపేతం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. జిల్లాలో 90 శాతం మంది స్థానిక ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నుంచే ఉన్నారని, అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారని, జిల్లాకు చెందిన మంత్రివర్యులు, గౌరవ స్పీకర్, ఇతర నేతల సహకారంతో తప్పకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. గతంలో లాగే తన గెలుపుకు సహకరించాలని స్థానిక ప్రతినిధులకు ఆమె విజ్ఞప్తి చేశారు.
Also Read : ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం