Wednesday, June 26, 2024
HomeTrending Newsకాంగ్రెస్ లో ఖమ్మం పేచి

కాంగ్రెస్ లో ఖమ్మం పేచి

ఖమ్మం లోకసభ స్థానం కోసం పార్టీ నేతల మధ్య జరుగుతున్న పోటీ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కోసం, మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తన కుమారుడు యుగంధర్ కోసం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన భార్య నందినికి పార్టీ టికెట్ దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

అమాత్యుల కుటుంబ సభ్యులకు టికెట్లు ఇచ్చేది లేదని అధిష్టానం తేల్చి చెప్పటంతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వీరందరూ పోటీ పడుతుంటే అనూహ్యంగా కొత్త పేరు తెరమీదకు వచ్చింది. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుకు ఇవ్వాలని ప్రతిపాదన వచ్చింది. దీని వెనుక మంత్రి తుమ్మల, ఓ మీడియా అధినేత హస్తం ఉందని జిల్లా నేతలు చర్చించుకుంటున్నారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు నుండి చంద్రబాబు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించిన నేత తుమ్మల. తెలంగాణ ఏర్పడినాక కెసిఆర్ స్వయంగా తుమ్మలకు ఖమ్మం జిల్లా పగ్గాలు అందించాడు. క్రమేణా కెసిఆర్ నిర్లక్ష్యంతో తుమ్మల ఒక అడుగు వెనక్కు తగ్గినప్పటికీ గత ఎన్నికలలో రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ జిల్లాలో అధికార పగ్గాలు చేపట్టారు.

ఖమ్మం సీటు కమ్మ వాళ్ళకే దక్కాలంటూ తొలుత తన కుమారుడికి ఇప్పించాలని భావించినప్పటికీ వారసత్వ రాజకీయాలకు పార్టీ అధిష్టానం చెక్ చెప్పటంతో… నాటి తెలుగుదేశంలో మిత్రుడు, సహచరుడు మండవ వెంకటేశ్వరరావును పోటీలోకి తీసుకొచ్చారని వార్తలు వస్తున్నాయి.

ఇందుకు తెలుగుదేశంలో సహచరుడు, సిఎం రేవంత్ ను సైతం ఒప్పించే ప్రయత్నం చేశాడు. తనకు తొలి నుండి సన్నిహితంగా వుంటూ.. 1996లో తెలుగుదేశంలో చక్రం తిప్పిన ఓ మీడియా అధినేత సహకారాన్ని తుమ్మల  తీసుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మండవ వెంకటేశ్వర రావు, మీడియా అధినేత ఒకే జిల్లా వారు కావటం… ఇద్దరు సన్నిహితులు కావటంతో మీడియా అధినేత చొరవ తీసుకున్నారని తెలిసింది. మండవకు ఖమ్మం జిల్లా నేతలతో సాన్నిహిత్యం లేదు. పైగా వెనకటి తెలుగుదేశం పార్టీ కాదు. కమ్మ సామాజికవర్గమనే టికెట్ ఇవ్వటం ఎంతవరకు సబబు అని స్థానిక నేతలు ప్రశ్నిస్తున్నారు. కేవలం ధనబలంతో జిల్లా రాజకీయాలను శాసిస్తున్న ఈ వర్గం ఓట్ల శాతం ఎంత? వారికి కట్టబెడుతున్న పదవుల శాతం ఎంత అని పార్టీ నేతలు విసుక్కుంటున్నారు.

అందరు అనుకున్నట్టుగానే మండవకు టికెట్ ఇస్తే ఖమ్మం లోక్ సభ స్థానంలో హస్తం పార్టీ ఓటమి అంచుల్లోకి వెళ్లకతప్పదని పార్టీ నేతలే అనుకుంటున్నారు. మండవకు ఇవ్వటం జరిగితే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో గొడవలు ముదిరే అవకాశం ఉంది. ఆయన గెలుపునకు భట్టి, పొంగులేటి ఎంతవరకు సహకరిస్తారో చూడాలి. ఎన్నికల సమయంలోనే మాటలు తూటాలు పేల్చే ఫైర్ బ్రాండ్ రేణుక చౌదరిని ఇప్పటికే కమ్మ కోటాలో రాజ్యసభకు పంపారని జిల్లాలో టాక్.

రెడ్డి సామాజికవర్గం కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే… కమ్మ సామాజికవర్గం పెత్తనం పెరుగుతోందని రెడ్డి నేతలు మండిపడుతున్నారు. సిఎంగా రేవంత్ రెడ్డి ఉన్నా కీలక నిర్ణయాలు కమ్మ లాబీయింగ్ ద్వారానే జరుగుతున్నాయని… ఖమ్మం వివాదం కాంగ్రెస్ లో నివురు గప్పిన నిప్పులా కనిపిస్తోందని హస్తం నేతలు అనుకుంటున్నారు.

ఖమ్మం అంటేనే కమ్మ వారి సొంతం అన్నట్టుగా పార్టీల ఆలోచనా సరళి ఉంది. అన్ని పార్టీల్లో అదే ధోరణి కొనసాగుతోంది. ఈ మధ్య కొంత రెడ్డి ప్రాబల్యం పెరిగినా మిగతా సామాజికవర్గం వారు కేవలం ఓట్లు, జనాభా లెక్కలకే పరిమితం అన్నట్టుగా పార్టీల వ్యవహార శైలి ఉంది. పైకి అంతా సజావుగా ఉన్నట్టు కనిపిస్తున్నా.. లోక్ సభ ఎన్నికల్లో తేడాలు వస్తే కులాల కుమ్ములాట ఖమ్మం నుంచే మొదలు కానుంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్