Sunday, January 19, 2025
Homeసినిమాకలగానే మిగిలిన కలలరాణి సినీ ప్రయాణం

కలగానే మిగిలిన కలలరాణి సినీ ప్రయాణం

సినీతారల జీవితం అద్దాల మేడ వంటిది. లోపలి నుంచి రాయి విసిరినా .. బయట నుంచి రాయి విసిరినా అది ముక్కలైపోతుంది. అందమైన .. ఆనందకరమైన .. విలాసవంతమైన వారి జీవితం అందరి మధ్యలోకి వచ్చేస్తుంది. అందువలన సినీ తారలు తమ జీవితంలోని చాలా విషయాలను చాలా గోప్యంగా ఉంచుతుంటారు. ఇక్కడ అమాయకత్వంతో .. మంచితనంతో తమ ఆస్తిపాస్తులను కోల్పోయినవారు కనిపిస్తారు. ముందుచూపు లేకుండా తీసుకున్న నిర్ణయాల కారణంగా తమ కెరియర్ ను కోల్పోయిన వారు కూడా కనిపిస్తారు.

గ్లామర్ పరంగా .. నటన పరంగా క్రేజ్ తెచ్చుకున్న కథానాయికలలో కొంతమంది సినిమాల నిర్మాణంలో చేతులు కాల్చుకున్నారు. అలాగే ప్రేమ పేరుతో తమకంటే తక్కువ స్థాయి వారిని పెళ్లి చేసుకుని, వాళ్ల నిజస్వరూపం తెలుసుకుని వైవాహిక జీవితాన్ని అంధకారం చేసుకున్నవారు కనిపిస్తారు. ఇక మరికొందరు తొందరపాటు నిర్ణయంతో అగ్రిమెంటు చేసి, భవిష్యత్తును పణంగా పెట్టినవారున్నారు. ఆ కారణంగా అందమైన జీవితంలో నుంచి అగాధంలోకి జారిపోయినవారున్నారు.

Kanchanamala

అలాంటి కథానాయికలలో కాంచనమాల ఒకరుగా కనిపిస్తారు. కాంచనమాల పేరును చాలామంది విని ఉంటారు .. ఈ తరం వారిలో చాలా తక్కువమంది ఆమె ఫొటోను చూసి ఉంటారేమో. కాంచనమాల సినిమాలను చూసినవారికి మాత్రం ఆమె పేరు చెప్పగానే, మకరందాన్ని నింపుకున్న మత్తు పాత్రల వంటి ఆమె కళ్లు గుర్తుకు వస్తాయి. విశాలమైన ఆ కళ్లు చేసే విన్యాసాలు చూస్తూ ఒక జీవిత కాలాన్ని గడిపేయవచ్చు. అలాంటి ఆకర్షణీయమైన నేత్రాలు కలిగిన కథానాయిక ఆనాటి నుంచి ఈనాటి వరకూ మళ్లీ తెరపైన కనిపించనే లేదని చెప్పాలి.

కాంచనమాలను తెరపై చూసినవారు .. వెన్నెల్లో చందమామను చూసిన అనుభూతిని పొందుతారు. పూతరేకులాంటి నాజూకు సౌందర్యం ఆమె సొంతం. 1930లలో .. మేకప్ సామాగ్రి అంతగా అందుబాటులోలేని ఆ కాలంలో .. అంత అందంగా కనిపించిన కాంచనమాలను ఎవరు మాత్రం మరిచిపోగలరు. కాంచనమాల ఇంతగా ఆనాటి కుర్రాళ్లపై ప్రభావం చూపిందంటే ఎన్ని సినిమాలు చేసి ఉంటుందో గదా అనుకోవడం సహజం .. కానీ ఆమె పట్టుమని ఓ పది సినిమాలు చేసి ఉంటుందేమో. అయినా ఆమె ఇప్పటికీ అందరికీ గుర్తుండటానికి కారణం .. ఆమె గ్లామర్. అవును ఆమె తొలితరం గ్లామరస్ హీరోయిన్.

Kanchanamala

తెలుగు సినిమా తొలి నాళ్లలో స్త్రీలు నాటకాలు ఆడటానికే ఇంట్లోవారు ఒప్పుకునేవారు కాదు. ఇక సినిమాల గురించి చెప్పేపనేలేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక ‘తెనాలి’ అమ్మాయి ధైర్యంగా సినిమాల్లోకి వచ్చి నటించడమనేది సాహసంతో కూడుకున్నపనే. సి.పుల్లయ్య దర్శకత్వంలో ఆమె 1935లో వచ్చిన ‘కృష్ణ తులాభారం’ అనే సినిమాలో ‘మిత్రవింద’ పాత్ర ద్వారా తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఆ తరువాత సంవత్సరంలో ‘వీరాభిమన్యు’ సినిమాలో కథానాయికగా కనిపించారు. అప్పట్లో ఆమె చేసిన ‘మాలపిల్ల’ ఒక సంచలనం.

ఆ తరువాత చేసిన ‘వందేమాతరం’ .. ‘మళ్లీ పెళ్లి’ .. ‘ఇల్లాలు’ .. ‘బాలనాగమ్మ’ సినిమాలు కాంచనమాల అభిమానులను .. ఆరాధకులను పెంచుతూ వెళ్లాయి. ‘బాలనాగమ్మ’ సినిమాలో ఆమె సౌందర్యాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవనిపిస్తుంది. అప్పట్లో ఎక్కడ చూసినా ఆమెను గురించే మాట్లాడుకునేవారు. కాంచనమాల చీరలు .. జాకెట్లు .. గాజులు మార్కెట్లోకి రావడం, ఆ రోజుల్లోనే ఆమెకి గల క్రేజ్ కి అద్దం పడతాయి. ‘మాలపిల్ల’లో ఒక సీన్లో ఆమె స్లీవ్ లెస్ జాకెట్ లో కనిపిస్తే అప్పటి కుర్రాళ్లు గగ్గోలెత్తిపోయిన రోజులవి. ఇప్పటికీ ఆ ఫొటోలు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి. అప్సరసలకు అసూయను పుట్టించే ఆమె అందం చాలా త్వరగా తెరపై నుంచి అదృశ్యమవుతుందని ఎవరూ అనుకోలేదు.

‘బాలనాగమ్మ’ సినిమాను జెమినీ వాసన్ నిర్మించారు. ఆ తరువాత కూడా తమ బ్యానర్లో ఆమె వరుస సినిమాలలో నటించేలా ఆయన అగ్రిమెంట్ రాయించుకున్నారు. కానీ ఆ తరువాత ఆయన సినిమాలు నిర్మించడం లేదు .. అగ్రిమెంట్ ప్రకారం ఆమె బయట సినిమాల్లో నటించడానికి వీల్లేకుండా పోయింది. బయట నుంచి కాంచనమాలకి అవకాశాలు వచ్చిపడుతున్నాయి. కానీ వాటిలో చేయడానికి వాసన్ ఒప్పుకోవడం లేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిన తరువాతనే కాంచనమాల మతిస్థిమితాన్ని కోల్పోయారు.

కాంచనమాలను మళ్లీ మామూలు మనిషిని చేయడానికీ .. తిరిగి ఆమెను సినిమాల్లో నటింపజేయడానికి చాలామంది సన్నిహితులు ప్రయత్నించారు. కానీ కాంచనమాల ఈ లోకంలోకి రాలేదు. ఎంతో ఆకర్షణీయమైన ఆమె కళ్లలో ఆందోళన తప్ప మరేవీ కనిపించలేదు. ఆమెకి ఎవరూ గుర్తుకులేరు .. ఏదీ గుర్తుకు లేదు .. అసలు తాను ఎవరన్నది కూడా ఆమెకి తెలియదు. అలా తెనాలిలోనే ఆమె తన చివరి రోజులను గడిపారు. ఎవరినీ గుర్తుపట్టలేని స్థితి నుంచి తనని ఎవరూ గుర్తుపట్టలేనంత స్థితికి ఆమె చేరుకున్న తరువాతనే చివరి శ్వాస విడిచారు. తెలుగు తెరపై ఆ కలలరాణి ప్రయాణం ఒక కలగానే మిగిలిపోయింది. ఈ రోజున ఆమె వర్ధంతి .. ఈ సందర్భంగా మనసారా ఓ సారి ఆమెను స్మరించుకుందాం.

(కాంచనమాల వర్ధంతి ప్రత్యేకం)

— పెద్దింటి గోపీకృష్ణ

Also Read : తెలుగు సినిమా సామ్రాట్… అక్కినేని

RELATED ARTICLES

Most Popular

న్యూస్