Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ANR: Synonym for Self confidence: జీవితంలో ఒక లక్ష్యమనేది లేకపోతే ప్రయాణమెటో తెలియకుండా పోతుంది. ఏ రంగంపట్ల ఆసక్తి ఉందో దానినే ఎంచుకోవాలి. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఆ మార్గంలోనే ముందుకు సాగిపోవాలి. ప్రయత్నమంటూ చేస్తేనే ఓడిపోతామో .. గెలుస్తామో తెలుస్తుంది. ఓడిపోతే గెలవడానికి ఏం చేయాలనేది అర్థమవుతుంది. సంకల్పం బలంగా ఉన్నప్పుడు సాధించకపోవడమనేది జరగదు. ఒకవేళ ఓటమి ఎదురైనా అది వాయిదా వేయబడిన గెలుపే అవుతుంది. అలా ఓటమి అంతుచూసి .. గెలుపు అంచులను చూసిన విజేతలతో అక్కినేని నాగేశ్వరరావు ఒకరుగా కనిపిస్తారు.

తెలుగు తెరకి ఎన్టీఆర్ .. ఏఎన్నార్ రెండు కళ్లు అని చెబుతుంటారు. అంతకుముందు కూడా అద్భుతమైన నటులు ఉన్నారు. కాకపోతే ఈ ఇద్దరితోనే తెలుగు సినిమా కొత్తదనం వైపు ఉరకలు పెట్టింది .. పరుగులు తీసింది. అందువలన ఆ ఇద్దరి పేర్లనే ముందుగా ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది. కృష్ణా జిల్లా గుడివాడ తాలూక ‘రామాపురం’ గ్రామంలో అక్కినేని జన్మించారు. కుటుంబ పరమైన సమస్యల వలన ఆయన 4వ తరగతికి  మించి చదువుకోలేకపోయారు. తనకి మొదట నుంచి ఆసక్తి ఉన్న నాటకాలపైనే ఆయన దృష్టి పెట్టారు.

Anr Lives

ఆ రోజులలో నాటకాలలో స్త్రీ పాత్రలు వేయడానికి స్త్రీలు ఎవరూ కూడా ముందుకు వచ్చేవారు కాదు. అందువలన పురుషులే స్త్రీ వేషధారణలో ఆ పాత్రలను పోషించేవారు. అలా స్త్రీ పాత్రలకు అక్కినేని ఫేమస్ అయ్యారు. అలా నాటకాలలో పడి తిరుగుతూ ఉన్న సమయంలోనే విజయవాడ రైల్వే స్టేషన్ లో దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్యకి ఆయన తారసపడ్డారు. అక్కినేని కళ్లలో ఏదో ఆకర్షణ ఉండటాన్ని గమనించిన ఆయన, సినిమాలు చేయమని ప్రోత్సహించారు. అలా చేస్తే భవిష్యత్తు బాగుంటుందని భావించిన ఆయన మద్రాసు బాట పట్టారు.

ఇటు బాల్యానికి .. అటు టీనేజ్ కి మధ్యలో ఉన్నప్పుడు ‘ధర్మపత్ని’ అనే సినిమాలో చిన్న వేషం వేసిన అక్కినేనిని, ‘సీతారామజననం’ సినిమాతో ఘంటసాల బలరామయ్య హీరోగా పరిచయం చేశారు. 1941లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తరువాత అదే ఘంటసాల బలరామయ్య ‘బాలరాజు’ సినిమాతో అక్కినేనికి ఫస్టు హిట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన ఇక వెనుదిరిగి చూసుకోలేదు. అక్కినేని అడుగుల వేగం పెరుగుతూ ఉండగానే, ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన వచ్చిన తరువాత తాను కాస్త కంగారుపడిన మాట వాస్తవమని ఒక సందర్భంలో అక్కినేని చెప్పారు.

ఇక ఆ తరువాత ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఎన్టీఆర్ పౌరాణికాలపై పట్టును సాధిస్తే, సాంఘికాలలో రొమాన్స్ ప్రధానమైన కథలను అక్కినేని అల్లుకుపోయారు. ఇద్దరూ కలిసి డజనుకు పైగా సినిమాలలో నటించారు. వాటిలో ‘మిస్సమ్మ’ .. ‘గుండమ్మ కథ’ .. ‘తెనాలి రామకృష్ణ’ .. ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ వంటి సినిమాలు ప్రధానంగా కనిపిస్తాయి. కెరియర్  తొలినాళ్ల లో అక్కినేని ‘దేవదాసు’లో చేసిన పాత్రను, ఆ తరువాత ఏళ్ల పాటు నటనలో ఆరితేరిన వారు సైతం ఆ పాత్రలో నటన పరంగా ఆయన దరిదాపులకు వెళ్లలేకపోయారు .. అదీ ఆయన గొప్పతనం.

ఇక ఆ తరువాత నవలా కథానాయకుడు అనిపించుకున్న అక్కినేని, అనేక విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వెళ్లారు. ఆయన నటన .. డాన్స్ తెరపై ఒక కొత్త అధ్యాయానికి తెరతీశాయి. హుషారైన పాత్రలలో ఆయన ఎంత చెలరేగిపోయేవారో, ఆవేదనతో నిండిన పాత్రలతోను అంతేలా కదిలించి వేసేవారు. ‘మూగమనసులు’ .. ‘డాక్టర్ చక్రవర్తి’ ప్రేమనగర్’ .. ‘ప్రేమాభిషేకం’ .. ‘ మేఘ సందేశం’ సినిమాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. ఇక ‘బుద్ధిమంతుడు’ లాంటి సినిమాలు ఆయన నటనలో వైవిధ్యానికి ఆనవాళ్లుగా కనిపిస్తాయి.

ఇక ఒక వైపున ఎన్టీఆర్ దేవుళ్ల పాత్రలను చేసుకుంటూ వెళుతుంటే, మరో వైపున  అక్కినేని భక్తుల చరిత్రలతో మెప్పిస్తూ వెళ్లారు. ‘విప్రనారాయణ’ .. ‘భక్త తుకారం’ .. ‘చక్రధారి’ .. ‘మహాకవి క్షేత్రయ్య’ వంటి సినిమాలు ఆ జాబితాలో కనిపిస్తాయి. ఏ పాత్ర వేసినా ఆ పాత్రలో పాలలో నీళ్లలా ఇమిడిపోవడం అక్కినేని ప్రత్యేకత. సుదీర్ఘమైన తన కెరియర్లో ఆయన ఎక్కువగా ఘంటసాల బలరామయ్య  .. వేదాంతం రాఘవయ్య .. తాతినేని ప్రకాశరావు .. ఆదుర్తి సుబ్బారావు .. వి. మధుసూదనరావు .. దాసరి నారాయణరావు దర్శకత్వంలో చేశారు.

Anr Lives

అక్కినేని సరసన చాలామంది కథానాయికలు సందడి చేశారు. ఆయన ఎక్కువగా అంజలీదేవి .. సావిత్రిలతో నటించారు. ఆ తరువాత స్థానాల్లో భానుమతి .. జమున .. కృష్ణకుమారి .. బి. సరోజాదేవి .. వాణిశ్రీ .. కాంచన .. జయసుధ . జయప్రద కనిపిస్తారు. ఇలా దశాబ్దాల తన నట ప్రయాణంలో ఎన్నో మనసులను దోచుకున్నారు .. మరెన్నో హృదయాలను గెలుచుకున్నారు. అక్కినేని ఒక నట సముద్రం .. కెరటాల్లాంటి ఆయన పాత్రలను పట్టుకుని పరిశీలించడం .. పరిశోధించడం కష్టం. తన ప్రతిభకు కొలమానంగా ఆయన రఘుపతి వెంకయ్య .. దాదాసాహెబ్ ఫాల్కే .. పద్మశ్రీ .. పద్మభూషణ్ .. పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. అలాంటి ఆ నట సామ్రాట్ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా మనసారా ఒకసారి ఆయనను స్మరించుకుందాం.

(ఏఎన్నార్ వర్ధంతి ప్రత్యేకం)

— పెద్దింటి గోపీకృష్ణ

Also Read : మాస్ యాక్షన్ హీరో కృష్ణంరాజు

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com