Saturday, November 23, 2024
Homeసినిమాసౌందర్యానికి నిర్వచనం

సౌందర్యానికి నిర్వచనం

Kanchanamala  : 1930లలో అందం గురించిన మాటలు ఎక్కడ వచ్చినా అక్కడ కాంచనమాల పేరు వినిపించేది. ముఖ్యంగా పెళ్లి చూపుల ప్రస్తావన వచ్చినప్పుడు ఆమెను తలచుకొని వారు ఉండేవారు కాదు. “ఇంకా అలా ఉంటే ఎలాగే అమ్మాయి .. లేచి తయారు కావాలి .. అబ్బాయికి కాంచనామాలలా కనిపించాలి”అని అమ్మాయి తరఫువాళ్లు అనేవారు. ఇక కుర్రాళ్లు పెళ్లి ప్రస్తావన వస్తే చాలు .. అమ్మాయి  కాంచనమాలలా ఉండాలని నిర్మొహమాటంగా చెప్పేవారు. అమ్మాయి అలా ఉంటుందని చెబితేనే పెళ్లి చూపులకు వస్తామని మొండికేసేవారు.

నిజానికి కాంచనమాల వంటివారు ఉంటే ఆమె గురించి ఇంతకాలం పాటు మాట్లాడుకుంటామా? ఆకాశంలో ఉన్న అందాల చందమామ ఒకటే .. అలాగే కాంచనమాల. ఆమె సౌందర్యానికి నిర్వచనం లేదు .. పోల్చదగిన రూపం లేదు. ఇంతగా అందరి మనసులను అమాంతంగా కొల్లగొట్టిన కాంచనమాల పుట్టి పెరిగింది గుంటూరు జిల్లా ‘తెనాలి’లో. చిన్నతనంలోనే ఆమె నాట్యం .. సంగీతం నేర్చుకున్నారు. అలాగే నటన పట్ల ఆసక్తిని కనబరిచారు. అప్పట్లో కాస్త పొద్దుపోతేనే ఆడపిలల్లను గుమ్మం దాటనిచ్చేవారు కాదు. అలాంటప్పుడు నాటకాలు .. సినిమాల వైపు ఆమె అడుగులు వేశారు.

సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ‘కృష్ణతులాభారం’ సినిమాతో ఆమె తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఈ సినిమాలో శ్రీకృష్ణుని అష్ట భార్యలలో ఒకరైన ‘మిత్రవింద’ పాత్రను ఆమె పోషించారు. ఆ తరువాత ఆమె పోషించిన ‘మాలపిల్ల’ .. ‘గృహలక్ష్మి’ .. ‘మళ్లీ పెళ్లి’ .. ‘ఇల్లాలు’ .. ‘బాలనాగమ్మ’ వంటి సినిమాలు కాంచనమాలను క్రేజ్ ను అంచలంచెలుగా పెంచేశాయి. నీలిమేఘాల్లాంటి కళ్లు .. పొడవైన ఒత్తైన జుట్టు .. సన్నని నాసిక .. పల్చటి పెదాలు అప్పటి కుర్రాళ్లకు కునుకు లేకుండా .. కుదురు లేకుండా చేశాయి. ఇంతకన్నా అందం ఈ ప్రపంచంలో ఉండటం కష్టమే అనుకున్నారు.

ఆ రోజుల్లో అందరూ కాంచనమాల అభిమానులే. కాదని ఎవరైనా చెబితే అబద్దమని అనేవారు .. లేదంటే అనుమానంగా చూసేవారు. ఎందుకంటే అందాన్ని ఆరాధించేవారు కాంచనమాలకు అభిమానులు కాకుండా ఉండలేరు. తెరపై ఆమె ఒకసారి రెప్పలార్చి విప్పితే ప్రేక్షకుల గుండె ఝల్లుమనేది. పాల సరస్సులో కదిలే నల్ల కలువల్లా ఆమె కళ్లు కదులుతూ ఉంటే అందుకు తగినట్టుగానే గుండె ఊయలలూగేది. అప్పట్లో ఒక సినిమాను పదే పదే చూసే అవకాశం ఉండేది కాదు. అందుకనే ఆమె ఫోటో ఉన్న కేలండర్ అందరి ఇళ్లలోను కనిపించేది. కాంచనమాల కేలండర్ లేకపోతే అదొక వెలితి .. లోటు అన్నట్టుగా ఉండేది.

ఇక అమ్మాయిలు కాంచనమాలలా కాస్త కనిపించినా చాలని భావించేవారు. అందుకే మార్కెట్లోకి కాంచనమాల చీరలు .. బ్లౌజులు .. గాజులు  .. బొట్టు బిళ్లలు వచ్చేవి. వాటికి గల డిమాండ్ కాంచనామాలకి గల క్రేజ్ ను చెబుతూ ఉండేవి. ఇంతగా ఇంతమంది హృదయాలను కొల్లగొట్టిన కాంచనమాల ఒక 100 సినిమాలు చేసి ఉంటుందేమో అనుకుంటే పొరపాటే. తెలుగులో ఆమె చేసింది పట్టుమని పది సినిమాలు ఉంటాయేమో. మరి ఆ తరువాత సినిమాలకు ఆమె ఎందుకు దూరమయ్యారు? అనే సందేహం కలగడం సహజం.

ఓ ప్రముఖ నిర్మాత తన సంస్థలోనే వరుస సినిమాలు చేయాలని ఆమెతో అగ్రిమెంట్ చేయించుకున్నాడు. ఆ తరువాత ఆయన సినిమాలు తీయలేదు .. వేరే సినిమాల్లో కాంచనమాలను చేయనీయలేదు. ఆ విషయంలో ఆయనతో గొడవపడిన ఆమెకి, తన కెరియర్ నాశనమైందనే విషయం అర్థమైపోయింది. కాంచనమాల పైకి ఎంత సుకుమారంగా .. సున్నితంగా కనిపిస్తుందో .. ఆమె మనసు కూడా అంతే. తన మనసుకు కష్టం కలిగే ఏ సంఘటన జరిగినా ఆమె కోలుకోవడానికి చాలా రోజులు పట్టేది. ఆమెతో సాన్నిహిత్యం కలిగిన వారందరికీ ఆ విషయం తెలుసు.

ఒక వైపున లక్షలాదిమంది ప్రేక్షకుల ఆదరణ. మరో వైపున అడిగినంత పారితోషికం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఇతర నిర్మాతలు. ఇంకో వైపున తన కెరియర్ కి సైన్ధవుడిలా అడ్డుపడిన నిర్మాత. డబ్బు .. పలుకుబడి ఉన్న ఆయనను ఎదిరించలేని నిస్సహాయత. ఈ మానసిక సంఘర్షణతో నలిగిపోయిన కాంచనమాల మతిస్థిమితాన్ని కోల్పోయారు. తన గురించిన సృహ లేకుండా పోయారు. ఇండస్ట్రీకి దూరంగా తిరిగి తెనాలి వెళ్లిపోయారు. తిరిగి ఆమెను మామూలు మనిషిని చేయడానికి సన్నిహితులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

Kanchanamala Beauty Queen

అందాల చందమామ అనుకున్నందుకు .. ఆమె జీవితాన్ని తొలగిపోని అమావాస్య కమ్ముకుంది. శూన్యంలోకి చూస్తూ ఒంటరి జీవితాన్ని అనుభవించారు. ఈ లోకంలోకి తిరిగి రాకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇంద్రధనస్సు ఆకాశంలో ఆ చివర నుంచి ఈ చివర వరకూ అందంగా పరచుకుంటుంది. చూసి ఆనందిస్తూ ఉండగానే ఆవిరైపోతుంది. తెరపై అందాల కథానాయికగా కాంచనమాల సాగించిన ప్రయాణం కూడా అలాగే కనిపిస్తుంది. ఈ రోజున (మార్చి 5 ) ఆమె జయంతి .. ఈ సందర్భంగా మనసారా ఒకసారి ఆమెను స్మరించుకుందాం.
— పెద్దింటి గోపీకృష్ణ

Also Read : కలగానే మిగిలిన కలలరాణి సినీ ప్రయాణం

RELATED ARTICLES

Most Popular

న్యూస్