7.8 C
New York
Saturday, December 2, 2023

Buy now

Home'ఐ'ధాత్రి ప్రత్యేకంరిషబ్ శెట్టి విశ్వరూపం

రిషబ్ శెట్టి విశ్వరూపం

Divine Review on Kantara: బ్రహ్మాండం, భజగోవిందం అంటూ భజన సమీక్షలు లేదా దూదేకినట్లు, కోడిగుడ్డుకు ఈకలు పీకినట్లు లాజిక్ లేని సినిమా సమీక్షలు చదివి…చదివీ విసిగిపోయారా? ఢిల్లీలో కేంద్రప్రభుత్వ ఉన్నతాధికారిగా పనిచేస్తున్న సాహితీ పిపాసి, రచయిత విప్పగుంట రామ మనోహర కాంతార సినిమా చూశాక ఎలా స్పందించారో చదవండి. నిడివి ఎక్కువయినా ఇది పూర్తిగా చదవకుండా మధ్యలో ఆపడం మీ తరం కాదు.

కాంతార ఓ అనుభవం. ఓ పూనకం. కాడబెట్టు మట్టి వాసన. ఓ సంభ్రమానుభవంలో, దైవానుభవంలో, భూతానుభవంలో తడిపి ముంచేసి కమ్మేసే తుళునాటి అడవి వాసన. తుళు సంస్కృతిలోని, సంప్రదాయాలలోని కొన్ని పార్శ్వాలని అందంగా చూపే ఓ కలైడోస్కోప్.. ప్రతి పాత్రా మెరిసే ఓ అద్దం ముక్క… ‘ఏదో చెబతా ఉంటది. నీ మనసుకి ఎక్కతా ఉంటది. విషయం అర్థమైనట్లే ఉంటది’. కైలాసం, కంబళ, పంజుర్లీ, గుళిగ, కోలం, దైవారాధన, భూతారాధన, ‘మాయ’మవటం, ప్రతీ కొత్త అంశం నీకు ఏదో కథ చెప్తుంది. అది అర్ధమయ్యే లోపే ప్రతీ సన్నివేశం నిన్ను లోలోపలికి తీసుకెళ్ళి పోతూ ఉంటుంది. చివరకు ఓ మార్మిక కాసారం లోకి నెట్టి ఊపిరాడని ఈత కొట్టిస్తుంది.

‘మహాదేవ’ మాటల్లో ‘గురవా’ని ఎవరు చంపారో ‘శివుడి’కి అర్థమయ్యీ కానట్లే ఉంటుంది. కాంతారా కూడా అంతే… అర్ధం అయ్యాక పూనకమే. పూర్తిగా అర్ధం అవ్వాలంటే …అద్దం ముక్కలన్నీ ఓ దగ్గర పెట్టి చూడాలి.

ఏ కథైనా నీకెలా అర్థమైతే అలా. పాఠకునికి అర్ధం అయ్యిందే కవిత్వం… ఎవడేం రాసినా. ప్రేక్షకునికి అర్ధమయ్యిందే సినిమా…ఎవడేం తీసినా. అందుకే కాంతార…నీ అర్థం నీది… నా అర్థం నాది. అందుకే ఈ సినిమాకి ఇన్ని రివ్యూలు.

కాంతారా ఒక దట్టమైన మార్మిక కాంతారం (అడవి). దాన్ని అర్థం చేసుకోవడానికి దారులెన్నో. దాని ప్రభావం నుండి బయటపడటానికి రోజులెన్నో… నిజంగానే… కంగనా రనౌత్ అన్నట్లు.  ‘పంజుర్లీ’ అరుపు వినబడిన మేరకు ఉన్న భూమిని, అక్కడి ప్రజలకు ఇచ్చేసి, ‘పంజుర్లీ’తో బాటు మనశ్శాంతినీ తనతో తీసుకెళ్తాడు రాజు. ఒకవేళ ఎప్పుడైనా ఇచ్చిన భూమి గురించి మాటతప్పితే రాజుని తను క్షమించినా ‘ఉగ్ర గుళిగ’ క్షమించడు అంటాడు ‘పంజుర్లీ’. ఇదే కథకి బీజం. రాజు మాట తప్పడు. కానీ అతని సంతతివాడు తప్పుతాడు.

తుళుభాషలో పంజి అంటే పంది. ‘పంజుర్లీ’ అంటే ఉగ్రరూపంలో ఉన్న పంజి అని కొందరు అర్థం చెప్పారు. అది వారి దైవం. తుళువ వంశ శ్రీ కృష్ణ దేవరాయని రాజ ముద్ర కూడా ఆది వరాహమే. కదంబ రాజులు వారి రాజ్యంలోని నదికి వారాహి అని పేరు పెట్టారు. తుళునాట భూతారాధన ఏటా జరిగే తంతు. భూతారాధనే భూతకోలా, అదే కాంతారాలోని కోలం. ‘భూత’ అనే పదానికి తుళు సంప్రదాయంలో చెడు అర్ధం లేదు. భూత అంటే ఆత్మ…దైవాత్మ. ఈ భూతాల్లోనూ అనేక వర్గీకరణలు. పై మెట్టు మీద ‘ఉళ్ళాయ భూతాలూ’ అంటే శివాంశ, దేవీ అంశ కలిగినవీ, మధ్య మెట్టు మీద రాజ భూతాలూ అంటే చనిపోయిన రాజుల, గొప్ప పనులు చేసిన వారి ఆత్మలూ, కిందిమెట్టు మీద క్షేత్రపాలకులూ అన్నమాట. అయితే అన్నీ దైవత్వాన్ని సంతరించుకున్నవే. ‘పంజుర్లీ’ దైవారాధనే మనం కాంతారాలో చూసింది.

‘గుళిగ’ క్షేత్ర పాలకుడు. చివరి సన్నివేశంలో శివుడిని పూనేది గుళిగే. గుళిగని రాయి రూపం లో పూజిస్తారు. రాజు వదిలిన ఖడ్గం తో శివుడు… గుళిగ పూనిన శివుడు..ఆ రాయిని తాకి… ఈ భూతాల గురించి ఏన్నో “పాడదాన”లు ఉన్నాయి తుళు భాషలో. అంటే జానపద పదాలూ పాటలూ అన్నమాట. పంజుర్లీ గురించి పన్నెండు పాడదానాలు వ్యవహారంలో ఉన్నాయి. ఇవి మౌఖికంగానే ప్రాచుర్యంలో ఉండేవనీ, లిఖితరూపంలో కొంతమంది మిషనరీలు కొన్నిటిని మాత్రమే నిక్షిప్తం చేశారని పరిశోధకులు అంటారు. డా. చిన్నప్ప గౌడ ‘భూతారాదనే –జనపదీయ అధ్యయన’ అనే పుస్తకమూ రాశారు. ఒక అసాధారణ జీవితాన్ని గడిపి ఒక లక్ష్యం కోసం అసాధారణ మరణం పొందిన వారిని కూడా భూతాలుగా (దైవాత్మ) గుర్తించి వారి పేరునా పాడదానాలు ఉన్నాయి. వారూ దైవారాధనలో భాగమయ్యారు. మన సమ్మక్క సారలమ్మల లాగా. భూతారాధన మీద పరిశోధన చేసిన డాక్టర్ వివేక్ రాయ్ ఇటువంటి ఉదాహరణలు ఎన్నో చూపిస్తారు. ఉదాహరణకు కోటి-చెన్నయ అనే బిల్లవ జాతి వారు “అగ్ర” కులాల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడి బలై దైవాత్మలుగా గుర్తింపు పొంది భూతారాధనలో భాగమైనట్లు మనకు తెలుస్తుంది. అలాగే, కాల్కుడా, కాలుర్తి అనే రాతి విగ్రహాలు చెక్కే అన్నా చెల్లెళ్ళు, ముండాల జాతికి చెందిన కోటేద బబ్బు వంటి భూతాలను( దైవాత్మ) ప్రస్తావిస్తారు. కోలం కట్టే వాళ్ళు అధికంగా “నిమ్న” కులాల వారవటం, కాంతారలో దొర వారిని చూసే తీరుని, వాళ్ళ ఇళ్ళల్లోకి తను వెళ్ళకపోవడం, వారిని తన ఇంటిలోనికి రానివ్వక పోవడం, శివుడి చేతులు పట్టుకున్నందుకు చేతులు కడుక్కోవడం వంటి వాటి ద్వారా అగ్ర కుల అహంకారాన్ని ప్రేక్షకులకు తెలియ చెప్తాడు దర్శకుడు.

ఈ సినిమావల్ల కర్నాటక ప్రభుత్వం కోలం కట్టే వారికి సహాయం ప్రకటించడం హర్షణీయం.  ప్రాంతాన్ని బట్టి పంజుర్లీ పేర్లు కూడా అనేకం…అన్నప్ప పంజుర్లి, తెంబికళ్ళ పంజుర్లి లాంటివి. జీవించి ఉన్నవాళ్ళు ‘జోగం’లోనూ (యోగ?), గతించిన వారు ‘మాయ’ లోనూ ఉన్నట్లు వారి నమ్మకం అంటారు వివేక్ రాయ్. మాయా జగత్తు లో ఉన్న భూతం (దైవాత్మ) మనిషి తో యోగించడమే కోలం. అందుకే కోలం సమయంలో ‘పత్రి’ (కోలంకట్టే వాడి) ఒంటి మీదికి వచ్చిన పంజుర్లి తిరిగి ‘మాయ’ మై పోతాడు. ఈ ‘మాయ’మయే శక్తి కేవలం భూతానికే ఉంటుందనే నమ్మకాన్ని కాంతారాలో ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశంగా మలచాడు రిషభ్ శెట్టి. చాలా బలమైన సన్నివేశమూ, ఆపై అధ్బుతమైన చిత్రీకరణా… వెరసి అలా ‘మాయ’వవడం వల్లే శివుని తండ్రి మాట్లాడిన మాటలు ‘అతని మాటలు కావు’, ‘అవి పంజుర్లీ మాటలే’ అనే నమ్మకాన్ని కలిగిస్తాయి.ఊరి ప్రజల మనస్సులో పంజుర్లీని సుస్థిరం చేస్తాయి. మాయమవడమే కథ లోని మార్మికత. నమ్మకపొతే కథ లేదు. కథ లేదని కాదు…కాంతారా కథ లేదని. అది వేరే ఏదో కథ అయ్యేది. ఎదో ఒక సామాజిక కథ అయ్యేది. నమ్మించ గలిగాడు రిషభ్. ఇందులో మూఢ నమ్మకం అని గొంతు చించుకోవాల్సిన విషయమూ లేదు, పనీ లేదు. అది సంస్కృతిలో భాగం. అలాగే చూడాలి.

Rich Cultural Devotional Values
‘పంజుర్లి’ ధర్మ సంస్థాపకుడు. ‘పాడదానా’ల ప్రకారం పార్వతి దేవి పెంచుకున్న ఓ చిన్న పంజి తన కదంబ వనాన్ని(పార్వతి కదంబ వనవాసిని) నాశనం చేస్తే, శివుడు దాన్ని పంజుర్లీ గా ధర్మ సంస్థాపన, భూరక్షణ చేయమని తిరిగి భూమి పైకి పంపాడు. అందుకే, ‘వరాహ రూపం దైవ వరిష్టం’ పాటలో “శివ సంభూత భువి సందాత” అనే వర్ణన. సాధారణంగా వరాహావతారం విష్ణ్వావతారం కదా మరి శివ సంభూత అన్నారెందుకు అనే దానికి ఈ సమాధానం. రిషభ్ దీనిని హిందూ సంప్రదాయం అన్నాడని సోషల్ మీడియాలో గోల. అయితే, ఈ కథ తరువాతి రోజుల్లో ప్రక్షిప్తం అయి ఉండవచ్చు. అటవీ సంప్రదాయాలతో వైదిక సంప్రదాయాలు కలిసి పోయిన తరువాతది అయి ఉండవచ్చు. అయితే, వేట నుండి వ్యవసాయానికి మళ్ళినప్పుడు పంటల్ని కాపాడుకోవడం కోసం మనిషి అడవి పందులతో పడ్డ ఘర్షణ ఈ పాడదానలో కనపడుతుంది. భయపెట్టే అంశానికి దైవత్వం ఆపాదించి ప్రసన్నం చేసుకొని ఆ భయంతోనే మమేకం అవడం అనే అంశం కోలం రూపంలో సంస్కృతిలో భాగమయింది. కోలం జరిగేటప్పుడు పాడదానాలు పాడుతారు తెంబరె అనే డోలు వాయిద్యంతో.

కేరళలోని తెయ్యం కూడా కోలం లాంటిదే.
ఏటా, కోలంలో ఊరి సమస్యలని పంజుర్లీకి నివేదించడం, వాటిపై పంజుర్లీ ‘పలుకు’ ఊరికి కట్టుబాటు కావడం ఆచారం. ఇప్పటికీ ఈ ఆచారం కొన్ని గ్రామాల్లో ఉందని చెప్తారు. వారు కోర్టు మెట్లు ఎక్కరు. పంజుర్లీ మాటే న్యాయ నిర్ణయం ఆ ఊరికి. కుటుంబ తగాదాలు కూడా ఇలానే తీర్చుకుంటారు. ఆ సందర్భంగా కుటుంబాలన్నీ కలిసి ఓ సంబరం జరుపుకుంటాయి. అందుకే, పంజుర్లీకీ, కోర్టు కీ ఎదురెదురు. కాంతారా లో పంజుర్లీని ప్రశ్నించిన రాజవంశస్థుడు భూమి లాక్కోవడానికి కోర్టుమెట్లు ఎక్కుతాడు. ఆ కోర్టుమెట్ల మీదే ‘పంజుర్లీ న్యాయాన్ని’ చవి చూస్తాడు. తన ఉనికిని ప్రశ్నించినందుకు “నిజంగా పంజుర్లీనే అయితే మాయమౌతాడు” అని ప్రకటించి నిజంగానే ‘మాయ’ మై ప్రజల్లో తిరుగులేని నమ్మకాన్ని కలిగించి “అత్యంత శక్తివంతమైన దేవుడు పంజుర్లీ” అనిపిస్తాడు పంజుర్లీ. తరువాతి కథనంలో, కోలం కట్టే గురవాని చంపి పంజుర్లీ గుడి ముందే పారేస్తారు. అక్కడ కోర్టుమెట్ల మీద రాజవంశస్థుడూ, ఇక్కడ పంజుర్లీ గుడి ముందు కోలం కట్టే గురవా ! అత్యంత నాటకీయంగా కట్టుబాట్లకీ, తమమీద రుద్ద బడ్డ ‘నాగరికత’ కీ మధ్య కాంతారాలోని సంఘర్షణని చూపించాడు దర్శకుడు ఈ రెండు సన్నివేశాలతో.

ఇక శివుడు. కోలం కట్టడు. స్వతంత్ర జీవి. ఉండేది కైలాసం. కైలాసం లోనే శివలీలలు. తుళులో కైల అంటే ఇల్లు అని అర్ధమట. ఎవడికీ లొంగడు ఒక్క అమ్మకి తప్ప. అడవి పందుల్ని వేటాడటం పంజుర్లీ పట్ల అపచారం అని అమ్మా, కానీ ఆమెకి తెలియకుండా శివుడు అదే వేట … పంజుర్లీని అపహాస్యం చేసే దొర మెప్పుకోసం చేస్తుంటాడు. చెట్లు నరకడం, వేటాడటం అతడి జీవితం… కైలాసంలో ఉంటూ వనాన్ని ధ్వంసం చేసిన పంజి లాగా.

ఇక్కడ కాంతారా మనకేదో చెప్తోందనిపిస్తుంది. ఎలా అయితే వనాన్ని/పంటల్ని ధ్వంసం చేసే స్థితి నుండి పంజి పంజుర్లీ గా, భూరక్షకుని గా మారుతాడో, సినిమాలో శివుడి రూపాంతరం సినిమాలో మనం చూస్తాం.

తుళునాడులో భూస్వాములు ప్రోత్సహించే ఆట కంబళ. దొరగారి దున్నలే గెలవాలి. శివుడు కంబళ గెలుస్తాడు కానీ కోలం మాత్రం కట్టడు. అమ్మ చెంప దెబ్బ కట్టుబాట్లని వదులుకునే తరానికీ, పట్టుకు వేళ్ళాడే పాత తరానికీ ఘర్షణని చూపిస్తుంది. తరువాత గురవ మరణం అమ్మ లో భయాన్ని నింపి తనే శివని కోలం కట్టొద్దు అని చెప్తుంది. అయితే, ధర్మ స్థాపకుడైన పంజుర్లీ శివుడికి తరచూ కర్తవ్యం గుర్తు చేస్తూ ఉంటాడు. కాంతారాలో దీనిని చాలా అద్భుతంగానూ, నమ్మే రీతిలోనూ చిత్రీకరించాడు. ఒక వైపు కోలం కట్టిన తన తండ్రి ‘మాయ’మైనప్పుడు భయపడ్డ పసి మనసుకి వచ్చే పీడ కలల్లాగా శివుడికి అనుభూతి కలుగుతూ ఉంటుంది. మరోవైపు నమ్మబలికేట్లు పంజుర్లీ శివుడి తో ఏదో చెప్తున్నట్లే మనకు అనిపిస్తుంది. హాట్సాఫ్ టు ది స్టోరీ రైటర్.

మరి ఈ ‘ఆధునికయుగం’ లో పంజుర్లీ నిజంగానే ధర్మ స్థాపన చెయ్యగలడా? అన్నదే ప్రశ్న. అయితే, రాజు మాట తప్పితే తను క్షమించినా, ఉగ్ర గుళిగ క్షమించడని పంజుర్లీ చెప్తాడు. గుళిగ క్షేత్రపాలక భూతం. అదే శివుడిని ఆవహిస్తుంది. ఈ సన్నివేశం ధియేటర్ లో కాక పుట్టిస్తుంది. కేకలు పెట్టిస్తుంది. ఎంత చెప్పినా తక్కువే. అంత బలంగా ఈ సన్నివేశం రావడానికి శివుడిని మొదటి నుండీ తీర్చి దిద్దిన విధానమే కారణం. కొన్ని తెలుగు సినిమాల్లో లాగా ఏ యూరోప్ లోనో తెల్ల తెల్ల తోళ్ళతో నాజూకు స్టెప్పులేసి ఊరికి రాగానే మాస్ ఫైట్ లో షర్ట్ నలగకుండా ఎగరేసి తన్నే హీరో కాదు శివ. మొదటి సీన్ నుండీ, శివుడు శివుడే. సూటితనం, మొరటుతనం. అనుకున్నదే చేస్తాడు. అనుకున్న తడవుగానే చేసేస్తాడు. కంబళలో దొర దున్నలు గెలవడం కూడా ఒప్పుకోడు. కంబళ శివుడిని నిజమైన హీరోగా ఎస్టాబ్లిష్ చేస్తుంది. లీల కనబడ్డప్పుడు దొరని కూడా దాటి వెళ్తాడు. ఫారెస్ట్ ఆఫీసర్ మురళిని అదే లెక్కలేనితనం తో ఎదుర్కొంటాడు. ఊరి సర్వే సమయంలో తన ఉగ్రరూపం చూస్తాం. ఇంతగా కూరిన పాత్ర… శివ అనే మందుపాత్ర  చివరి సీన్లో తెరపై విస్ఫోటనమే. నిప్పుల వర్షమే.

Rich Cultural Devotional Values

కాంతారాలో ఫారెస్ట్ ఆఫీసర్ మురళీధర్ భూరక్షణ, జంతు రక్షణ చేసే పనిలో ఉంటాడు. పంజుర్లీ చెయ్యాల్సిన పని అది. సినిమాలోని అసలు మార్మికత ఇదే. అంతర్లీనంగా పంజుర్లీ కి సరైన ప్రత్యామ్నాయం ప్రజా ప్రభుత్వమే అని చెప్పే ప్రయత్నమేమో. అక్కడ కూడా, కొంతమంది అడవిపందినే వేటాడుతారు, మురళి కోపానికి బలౌతారు. సింబాలిక్ గా భూరక్షకుడైన పంజుర్లీని మట్టుపెడుతున్నారని అనిపిస్తుంది. తమ అడవినీ, సంస్కృతీ సంప్రదాయాల్ని తమే నాశనం చేసుకుంటున్నారని అర్ధం స్ఫురిస్తుంది. శివుడూ మొదట్లో తుపాకీ గురి పెట్టేది అడవి పంది పైకీ, మురళీ పైకే. పంటల్ని నాశనం చేసే పంజికీ, మనుషులకీ మధ్య ఘర్షణ లాగే… కోలాన్ని చులకనచేసి తమ ఊరి వ్యవహారాల్లో జ్యోక్యం చేసుకునే అహంకారపూరిత మురళీకీ శివుడికీ మధ్య ఘర్షణ చూపిస్తాడు దర్శకుడు. పై అధికారి ద్వారా అహంకారం వదులుకోమని పదే పదే చెప్పిస్తాడు దర్శకుడు. దైవత్వాన్ని పొందిన పంజి పంజుర్లీ అయినట్లు మురళి కూడా అహం వదిలి మారినప్పుడు శివుడూ చేరువౌతాడు. అందుకే కోలం కట్టిన శివుడు మురళిని ఆహ్వానించి ఊరి ప్రజలతో అతని చేతులు కలుపుతాడు. ఇక నుండి ప్రభుత్వమే రక్షణ అనే అర్ధం స్ఫురింపజేస్తాడు. కోలం కట్టిన శివుడు కూడా ‘మాయ’మయి తన తండ్రితో ఐక్యం అవడం కాంతారా మార్మికతలో మరో మెట్టు. దాని అర్ధం ఏమిటనే ప్రశ్న ప్రేక్షకునికి కలిగిస్తుంది.

Rich Cultural Devotional Values

చివరి ఘట్టం లో శివుడి కొడుకు ఒక ప్రశ్న వేస్తాడు..ఇద్దరూ మాయమై పోయారా అని. ఈ సన్నివేశం లో శివుడి కొడుకు పలకా బలపం తో కనిపిస్తాడు. సుందర సుందరంగా నవ్వుతాడు.

దర్శకుడు చెప్పాలనుకున్నాడో లేదో కానీ, ఇక పంజుర్లీ మాయమైనా, రక్షణ కేవలం చదువు ద్వారానే అనే సూచన చేశాడా లేక సినిమాకి సీక్వెల్ ఏమైనా సూచించాడా? అనేది వేచి చూడాలి.

Also Read : తెలుగులో ‘కాంతార’కి బ్రహ్మరథం 

Also Read : అతడు అడవిని జయించాడు

RELATED ARTICLES

Most Popular

న్యూస్