జనవరి 18 నుంచి కంటివెలుగు-2

అందరు కలిసి ఉత్సాహంగా పని చేసి కంటి వెలుగు-2ని విజయవంతం చేద్దామని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు-2 కార్యక్రమం ప్రారంభంకానున్నది. ఈ సందర్భంగా కార్యక్రమంపై డీహెచ్‌ఓలు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, క్వాలిటీ టీమ్స్‌,
ప్రోగ్రామ్‌ ఆఫీసర్లకు హైదరాబాద్ లోని ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని ఈ రోజు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి
హరీశ్‌రావు ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చారని, ఇంతకు ముందు 1.54కోట్ల మంతికి పరీక్షలు చేసి, 50లక్షల మందికి కంటి అద్దాలు ఇచ్చినట్లు తెలిపారు.

ఇది ‘వరల్డ్‌ లార్జెస్ట్‌ కమ్యూనిటీ ఐ స్క్రీనింగ్‌ పోగ్రామ్‌’గా నిలిచిందని చెప్పారు. ప్రజల కంటి సమస్యలు తొలగించేందుకు మరోసారి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈసారి కోటిన్నర మందికి పరీక్షలు చేసి, 55లక్షల మందికి అద్దాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో 30లక్షల మందికి రీడింగ్‌ గ్లాసెస్‌, 25లక్షల మందికి ప్రిస్క్రిషన్ గ్లాసెస్‌ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరు కలిసి ప్రజలను భాగస్వాములను చేసి విజయవంతం చేయాలన్నారు.

ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని, అధికారులంతా పూర్తి బాధ్యతతో పని చేయాలన్నారు. కార్యక్రమానికి ప్రభుత్వం రూ.200కోట్లు కేటాయించిందన్నారు. గతేడాది ఎనిమిది నెలల్లో కార్యక్రమం నిర్వహించగా.. ఈసారి వంద పని దినాల్లో చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తొలిసారి 827 బృందాలు పని చేస్తే.. ఇప్పుడు ఆ సంఖ్యను 1500కు పెంచినట్లు చెప్పారు.

కంటి వెలుగు శిక్షణా కార్యక్రమంలో ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, మంత్రి దయాకర రావు

జనవరి 5న కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ ఉంటుందన్నారు. ఎక్కడా ఇబ్బందులు రావొద్దని, సమస్య వస్తే రీప్లేస్‌ చేయాలని, బృందాలకు అవసరం అయ్యే ఏర్పాట్లు చేయాలన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, పూర్తి స్థాయిలో ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఆయా బృందాలకు రోజువారీ ప్లానింగ్‌ ఇవ్వాలని, పరీక్షలు చేయించుకోవడం మిస్సయిన వారి కోసం మళ్లీ ఏర్పాటు చేయాలన్నారు. జనవరి ఒకటి వరకు ఆటో రిఫ్రాక్తో మిషన్లు వస్తాయని, కార్యక్రమం ప్రారంభానికి ముందే రీడింగ్‌ గ్లాసెస్‌ అందుబాటులోకి వస్తాయన్నారు.

పరీక్షలు చేసిన నెల రోజుల్లో ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఫైనల్‌ ఇయర్‌ స్టూడెంట్స్‌కు సైతం శిక్షణ ఇచ్చి.. సేవలను వినియోగించుకుంటామన్నారు. స్టేట్ లెవెల్ 10 క్వాలిటీ కంట్రోల్‌ బృందం, జిల్లాకో క్వాలిటీ కంట్రోల్‌ బృందాన్ని నియమించి.. కార్యక్రమం ప్రభావవంతంగా జరుగుతుందా? లేదా? పరిశీలించనున్నట్లు చెప్పారు. ఎల్ వీ ప్రసాద్, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి సహకారంతో సిబ్బందికి రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇస్తామని, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు అద్దాల డిమాండ్‌ తీర్చేలా ఆటోమేటిక్‌ ఆర్డర్‌ ఫెసిలిటి ఉంటుందన్నారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *