తెలుగుభాషలో దయ్యం ఎన్ని హొయలు పోయిందో? ఎంత ముద్దుగా ఒదిగిపోయిందో?
ఎన్ని దయ్యం నుడికారాలో? ఎన్ని దయ్యం సామెతలో? ఎన్ని తిట్లో? ఎన్నెన్ని దయ్యం పోలికలో?
దయ్యాన్ని అనవసరంగా ఆడిపోసుకుంటున్నాం కానీ, మనం దయ్యాలకు భిన్నంగా ఉంటున్నామా
ఒకప్పుడు ఊరికి ఉత్తరాన శ్మశానంలో సమాధులను అరుగులుగా చేసుకుని చీకటి పడ్డాక దయ్యాలు నిద్రలేచేవి. ఇప్పుడు శ్మశానాలన్నీ ఊళ్లో కలిశాక దయ్యాలకు రాత్రి పగలు తేడా తెలియక చస్తున్నాయి.
చీకటి, ఒంటరిగా ఉంటే మనపక్కన దయ్యాలే తోడు ఉన్న అనుభూతి కలుగుతుంది.
తెలుగు సినిమాల్లో దయ్యాలను హీరో – హీరోయిన్లను చేసిన విఠలాచార్యకు ఏమిచ్చి ఋణం తీర్చుకోవాలో తెలియక ఇప్పటికీ దయ్యాలు జుట్లు పీక్కుంటున్నాయి. మన జానపద కథలనిండా దయ్యాలే దయ్యాలు. దయ్యానికి శరీరం లేక మనశరీరాలను అద్దెకు తీసుకుంటాయి. మన భాషే మాట్లాడతాయి. కానీ దెబ్బకు దయ్యం దిగిపోవాల! అని భూత వైద్యుడు కొడితే దెబ్బలుమాత్రం మనకే తగులుతాయి.
దయ్యాలతో మాట్లాడే నిపుణులు ఉంటారు. ఆ భాష, దాని వ్యాకరణం, నిఘంటువులు ఏ శ్మశానంలో దొరుకుతోయో రహస్యం. అందుకే శ్రీ శ్రీ ప్రతీకాత్మకంగా శ్మశానాల నిఘంటువుల సంకెళ్లు తెంచుకుని అన్నాడేమో!
టీ వీ యాంకర్ల భాష మీద కూడా ఇలాంటి ముద్రలేవో ఉన్నాయికానీ ఆ వివరాల్లోకి వెళ్లడం సభా మర్యాదకాదు.
దయ్యం తిండి అని ఏనాడూ తిండి తినని దయ్యాన్ని తిట్టుకు వాడుకుంటున్నాం.
మనలోపలే కనపడని దయ్యాలుంటాయి. మనకు కనపడవు కానీ.. ఎదుటివారికి మనలో దయ్యం కొట్టొచ్చినట్లు, మింగడానికి వచ్చినట్లు, మీదపడుతున్నట్లు స్పష్టంగా కనపడుతుంది.
చచ్చి దయ్యలయిన వాటికి యూనిఫామ్ పధ్ధతి పాడు ఉంటుంది. జీవించి ఉన్న దయ్యాలను గుర్తించినవాడే నిజమయిన భూత వైద్యుడు.
దయ్యాలు భూత ప్రేత పిశాచ శాకినీ డాకినీల మధ్య స్వరూప స్వభావాల్లో తేడాలేమిటి? వాటి గుణగణాల్లో మార్పులేమిటి? అన్నది పెద్ద సబ్జెక్ట్. బతికి ఉన్నవారి కంటే చచ్చి భూత ప్రేతాలయిన వాటి మీద మన భయభక్తులు, గౌరవాభిమానాలు ఈనాటివి కాదు.
కర్ణాటకలో “ప్రేత మదువే(ప్రేత కళ్యాణం)” పేరిట ఇప్పటికీ ఒక ఆచారం ఉంది. చనిపోయిన వారి ప్రేతాత్మలకు పీటలు వేసి, శాస్త్రోక్తంగా పెళ్లి చేస్తారు. ఊరందరినీ పిలిచి శక్తి మేర వెజ్, నాన్ వెజ్ భోజనాలు పెడతారు. రెండు ఖాళీ కుర్చీల మీద ప్రేతాత్మలకు గుచ్చుకోకుండా మెత్తటి వస్త్రం కూడా పరుస్తారు. వచ్చిన అతిథులు పీటలమీద ప్రేతాత్మల మీద అక్షతలు చల్లి.. ఆశీర్వదించి వెళతారు. గిఫ్టులు, రిటర్న్ గిఫ్టులు ఉన్నాయో! లేదో! తెలియదు.
మామూలుగా అయితే-
“శతమానం భవతి” అని ఆశీర్వదిస్తారు.
ఇక్కడ బహుశా-
“చచ్చినా చావని దాంపత్య బంధంతో ఒకరి ఆత్మలో ఒకరు ఒదిగిన మీ ప్రేతాత్మల ఆత్మానుబంధం బతికి ఉన్న ఈలోకానికి ఒక ఆదర్శం కావాలి…” అని కానీ;
“ప్రేతాత్మానుబంధం శతమానం భవతి” అని కానీ ఆశీర్వదిస్తారేమో!
ఏమో?
“మా ప్రేతాత్మ కుమార్తెకు తగిన ప్రేతాత్మ వరుడు కావలెను”
అని కర్ణాటకలో పత్రికల్లో వచ్చిన ఒక ప్రకటన వైరల్ అయ్యింది.
అనుకుంటాం కానీ..
బతికి ఉన్నవారికి సంబంధాలు కుదర్చడానికే లోకం చచ్చిపోతోంది. అలాంటిది చచ్చినవారికి తగిన ఈడు జోడుతో సంబంధం కుదర్చడమంటే మాటలా? అవేమన్నా మనుషులా! గంతకుతగ్గ బొంత అనుకుని మనలా ఏదో ఒక దొరికిన సంబంధంతో తృప్తిపడడానికి! బతికి ఉండగా తీరని కోరికలు తీర్చుకోవడానికే చచ్చాక చూరు పట్టుకుని వేలాడే ప్రేతాత్మలు. ప్రేతాత్మలకు మాత్రం మనసులు ఉండవా? ముద్దూ ముచ్చట ఉండదా? ఆదివారం. అమావాస్య. అర్ధరాత్రి. నక్కలు ఊళలు వేసే వేళ. గుడ్లగూబలు ఒళ్లు విరుచుకునే వేళ. గబ్బిలాలు రెక్క విప్పే వేళ. శ్మశానంలో చితి మంటల చిటపటల చుట్టూ తిరుగుతూ…పగిలే పుర్రెల సాక్షిగా.. వెలిగే చితుల వెలి బూడిద నుదుట బొట్టుగా…”అస్త్రాయ ఫట్ ఫట్ ఫట్…వస్త్రాయ ఝట్ ఝట్ ఝట్..” లాంటి ప్రేతోక్త మంత్రాలు మిన్ను మిడుతుండగా…పెళ్లి జరగాలని ప్రేతాత్మలకు పెళ్లి మురిపెం ఉండదా మరి!
“పోయినోళ్లు అందరూ మంచోళ్లు”. అలాంటి మంచోళ్ళకు మంచెలు వేసి…బాసికాలు కట్టి…మంచి ముహూర్తంలో మాంగల్యధారణ చేయించి.. శోభనాలకు మంచాలు వేయించినవారందరూ ఇంకా మంచివారు!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు