భద్రాచలంలో రాముడి ఆలయం నిర్మాణం కోసం కంచర్ల గోపన్న(రామదాసు) కష్టాలు పడగా… ఆధునిక యుగంలో అయోధ్య రాముడి విగ్రహానికి సాయం చేసినందుకు కర్ణాటకలో ఓ భక్తుడు పభుత్వానికి దండుగు కట్టే పరిస్థితి ఉత్పన్నం అయింది.
అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని రూపొందించేందుకు పురాతన కృష్ణ శిలను(నల్ల రాయి) గుర్తించినందుకు శ్రీనివాస్ నటరాజ్ అనే కాంట్రాక్టర్‌కు కర్ణాటక సర్కార్ షాక్ ఇచ్చింది. ప్రైవేట్ స్థలంలో అక్రమంగా మైనింగ్ చేశారని ఆరోపిస్తూ కర్ణాటక మైనింగ్, భూగర్భ శాఖ ఆయనకు 80 వేల రూపాయల జరిమానా విధించింది.
జరిమానాను చెల్లించేందుకు శ్రీనివాస్ తన భార్య బంగారం నగలను తాకట్టు పెట్టాల్సి వచ్చిందని స్థానిక మీడియా పేర్కొన్నది. మైసూర్ జిల్లా HD కోటే తాలూకాలోని హరహోల్లి గుజ్జెగౌడనపుర అనే గ్రామానికి చెందిన రామదాస్ అనే రైతుకు చెందిన పొలంలో రాళ్లను తొలగించేందుకు శ్రీనివాస్‌కు కాంట్రాక్టు వచ్చింది. ఈ క్రమంలో ఒక పెద్ద రాయిని మూడు భాగాలుగా చేశామని, అందులో ఒకదాన్ని బాలక్‌రామ్ విగ్రహ రూపకల్పన కోసం ఎంచుకొన్నారని శ్రీనివాస్ నటరాజ్ తెలిపారు.
నిజాం ఏలుబడిలో అప్పుడు రామదాసు కష్టనష్టాలకు ఒర్చాడు. ఇప్పుడు రామదాసు పొలంలో కృష్ణ శిల వెలికి తీసినందుకు శ్రీనివాస నటరాజు జరిమానా చెల్లించాడు. గనుల శాఖ అనుమతి తీసుకోనందున తనదే తప్పు అని తెలుసుకున్న శ్రీనివాస్ నోటీసులు అందుకున్న వెంటనే జరిమానా చెల్లించాడు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, గనుల శాఖలోని ఉద్యోగుల ద్వారా విషయం బయటకు రావటంతో రాజకీయ వివాదంగా మారింది.
ఈ వ్యవహారంపై కన్నడ బిజెపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. జరిమానా మొత్తాన్ని శ్రీనివాస్ కు బిజెపి తరపున చెల్లిస్తామని మైసూర్-కొడగు ఎంపి, బిజెపి నేత ప్రతాప్ సింహ వెల్లడించారు.
-దేశవేని భాస్కర్