Sunday, January 19, 2025
HomeTrending Newsహంగ్‌ దిశగా కర్ణాటక

హంగ్‌ దిశగా కర్ణాటక

కర్ణాటకలో వచ్చే ఏప్రిల్‌/మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోటీ జరగనుందని పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నిర్వహించిన మొదటి ట్రాకర్‌ పోల్‌ సర్వేలో వెల్లడయ్యింది. ‘సౌత్‌ ఫస్ట్‌’ న్యూస్‌ వెబ్‌సైట్‌ కోసం పీపుల్స్‌పల్స్‌ సంస్థ – ‘సిస్రో’ తో కలిసి తాజాగా ఈ సర్వే నిర్వహించింది. రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాల్లో, మెజారిటీ రాకపోయినా… కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలు సాధిస్తుందని, మొత్తమ్మీద హంగ్‌ ఏర్పడే అవకాశాలున్నాయని ట్రాకర్‌ పోల్‌లో వెల్లడయింది.
పీపుల్స్‌పల్స్‌ డైరెక్టర్‌ ఆర్‌.దిలీప్‌రెడ్డి గురువారం మొదటి ట్రాకర్‌పోల్‌ ఫలితాలను విడుదల చేశారు. మొదటి ట్రాకర్‌ పోల్‌ 2022 డిసెంబర్‌ 22 నుండి 31 వరకు నిర్వహించారు. పది రోజుల పాటు జరిగిన తాజా సర్వే గణాంకాలను శాస్త్రీయంగా అన్వయించి విశ్లేషించి, సిస్రో వ్యవస్థాపక డైరెక్టర్‌ ధనుంజయ్‌ జోషి ఆధ్వర్యంలో నివేదిక రూపొందించారు. ఎన్నికల లోపు రెండు విడతల్లో రాష్ట్రంలో ఈ సర్వే జరుగనుంది. మరో రెండు మార్లు ట్రాక్‌ పోల్స్‌ సర్వేను 2023 మార్చిలో ఒకసారి, సరిగ్గా ఎన్నికల ముందు మరోసారి చేపడుతారు.
కర్ణాటకలో గత మూడున్నర దశబ్దాలుగా అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా వరుసన తిరిగి విజయం సాధించలేదు. దక్షిణ భారత దేశంలో కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి, ఇక్కడ అధికారం నిలుపుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. 2022లో ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో వరుసగా రెండోసారి తామే అధికారంలోకి వచ్చినట్టు ఇక్కడ కూడా పట్టు సాధించి, తిరిగి అధికారం నిలుపుకోవడానికి బిజెపి ప్రయత్నిస్తోంది. మరోవైపు, హిమాచల్‌ ప్రదేశ్‌లో అధికార మార్పు సంప్రదాయం కొనసాగినట్లే ఇక్కడ కూడా అధికార పార్టీ పరాజయం పాలయ్యి, తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌, జేడి(ఎస్‌) పార్టీలు ధీమాతో ఉన్నాయి.
పీపుల్స్‌ పల్స్‌-సిస్రో రీసెర్చ్‌ సంస్థలు నిర్వహించిన మొదటి ట్రాకర్‌ పోల్‌ సర్వే ప్రకారం 224 అసెంబ్లీ స్థానాల్లో 101 స్థానాలు (ప్లస్‌/మైనస్‌ 9 స్థానాలు) సాధించి కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. అధికార బీజేపీ 91 స్థానాలకు (ప్లస్‌/మైనస్‌ 7 స్థానాలు) పరిమితమవుతుందని, జేడి (ఎస్‌) 29 (ప్లస్‌/మైనస్‌ 5 స్థానాలు), ఇతరులు మూడు స్థానాలు సాధించవచ్చని ట్రాకర్‌పోల్‌లో తేలింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 113 స్థానాల మెజార్టీ సంఖ్యను ఏ పార్టీ సాధించలేకపోతోంది. 2018 ఎన్నికల తర్వాత రెండు పార్టీల కూటమి ప్రభుత్వం మరోసారి ఏర్పడే అవకాశాలున్నాయి. రాబోయే ప్రభుత్వ ఏర్పాటులో తాము కీలకంగా మారనున్నామని జేడి(ఎస్‌) ఇప్పటికే చెబుతూ వస్తోంది. వాస్తవిక ఫలితాలు ట్రాకర్‌పోల్‌ సర్వే అంచనాల ప్రకారంగానే ఉంటే, అదే నిజమై జేడీ(ఎస్‌) కీలకం కానుంది.
ట్రాకర్‌పోల్‌ సర్వే గణాంకాల ప్రకారం కాంగ్రెస్‌ 2018 ఎన్నికలతో పోలిస్తే రెండు శాతం ఓట్లను పెంచుకొని 22 స్థానాలను అధికంగా సాధిస్తుందని తేలింది. 2018లో 38 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్‌ ఈసారి 40 శాతం సాధిస్తుందని రహస్య బ్యాలెట్‌ ద్వారా నిర్వహించిన ట్రాకర్‌పోల్‌ సర్వేలో తేలింది.
అదే సమయంలో బీజేపీకి, 2018 ఎన్నికలతో పోలిస్తే 0.2 శాతం ఓట్లు తగ్గే ఆస్కారం కనిపిస్తోంది. 2018లో 36.2 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ ఇప్పుడు 36 శాతం ఓట్లు సాధిస్తుంది. ఈ స్వల్ప వ్యత్యాసంతో ఆ పార్టీ 13 స్థానాలు కోల్పోనుంది.
పీపుల్స్‌ పల్స్‌-సిస్రో రీసెర్చ్‌ సంస్థల సర్వే ప్రకారం, జేడి (ఎస్‌) ఈ ఎన్నికల్లో కిందటి ఎన్నికల కన్నా తక్కువ ఓటు షేరుతో, తక్కువ సంఖ్యలో సీట్లు సాధిస్తూ కూడా ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనుంది. ఈ పార్టీ 16 శాతం ఓట్లు సాధించనుంది. 2018 ఎన్నికలతో పోలిస్తే 2.4 శాతం తక్కువ సాధించి 29 సీట్లు (కిందటిసారి వారి సంఖ్య 37) పొందుతుంది. జేడి(ఎస్‌) దృష్ట్యా చూస్తే ఆ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగినా దాదాపు తన ఓటు బ్యాంకును నిలుపుకోవడం ఎంతో కీలకం. రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలంటే తన ఓటు బ్యాంకును జెడిఎస్‌ నిలుపుకోవడంతోపాటు అధిక సీట్లను సాధించాలి.
కర్ణాటక ఎన్నికల్లో కులాలతో పాటు మత అంశాలు కూడా కీలకంగా మారనున్నాయని సౌత్‌ ఫస్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ కోసం పీపుల్స్‌ పల్స్‌`సిస్రో రీసెర్చ్‌ సంస్థలు నిర్వహించిన ట్రాకర్‌పోల్‌ సర్వేలో తేలింది. ఓబీసీలు, మాదిగలు, హోలియాలు, దళితులు, ఆదివాసీలు, ముస్లింలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిస్తున్నారు. మరోవైపు అగ్రకులాలు, వొక్కలింగాలు, లింగాయత్‌లు బిజెపి వెంట ఉన్నట్లు ట్రాకర్‌పోల్‌ సర్వేలో తేలింది. జేడి (ఎస్‌) ప్రధాన ఓటు బ్యాంకు అయిన వొక్కలింగాలలో 50 శాతం మంది ఈ పార్టీకి మద్దతుగా ఉన్నారు.
అహిందా కూటమి, వొక్కలింగాయతేతరులైన ఓబిసీలు, దళితులు, ఆదివాసీలు, ముస్లింలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవడంతో ఆ పార్టీ కొంతమేర ఆధిపత్యం పొందుతుందని ట్రాకర్‌పోల్‌ లో తేలింది. 2013`2018 కాంగ్రెస్‌పార్టీ కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాలంలో, ఆయా వర్గాల సంక్షేమ పథకాల ప్యాకేజీలను అందజేయడం, సమర్థంగా అమలుపరచడంతో కాంగ్రెస్‌కు పార్టీకి వీరి నుండి ఎక్కువ మద్దతు లభిస్తోంది.
పీపుల్స్‌పల్స్‌- సిస్రో రీసెర్చ్‌ సంస్థలు నిర్వహించిన ట్రాకర్‌పోల్‌ సర్వేలో, కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్నకు సిద్దరామయ్యకు 28 శాతం మద్దతిచ్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మైకు 19 శాతం, కుమారస్వామికి 18 శాతం మంది నుంచి మద్దతు లభించింది.
హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితే ఏయే పార్టీలు కూటమిగా ఏర్పడాలన్న నిర్దిష్ట ప్రశ్నకు, కాంగ్రెస్‌, జేడి (ఎస్‌) కూటమి ప్రభుత్వం ఏర్పడాలని 41 శాతం బిజెపి, జేడి (ఎస్‌) కూటమి ప్రభుత్వం ఏర్పడాలని 38 శాతం మంది అభిప్రాయపడ్డారు.
అవినీతి, ఉద్యోగ నియామకాలలో కుంభకోణాలు, నిరుద్యోగం, పెరిగిన ధరలు`ద్రవ్యోల్బణం అంశాలు బిజెపికి అడ్డంకులుగా ఉన్నాయని ఈ ట్రాకర్‌పోల్‌ సర్వేలో తేలింది. రైతులలో 40 శాతం, నిరుద్యోగులలో 41 శాతం కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్‌కు 8 శాతం ఆధిపత్యం లభిస్తుండగా, బిజెపికి పట్టణ ప్రాంత్రాల్లో కేవలం ఒక శాతం మాత్రమే ఆధిక్యం కనిపిస్తుంది.
కర్ణాటక అభివృద్ధికి ఏ పార్టీ పాలన మెరుగైనదని ప్రశ్నించినపుడు, 38 శాతం కాంగ్రెస్‌, 36 శాతం బిజెపి, 18 శాతం జేడి (ఎస్‌)కి అనుకూలంగా ఓటర్లు స్పందించారు. రాబోయే ఎన్నికల్లో కర్ణాటకలో ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు చేస్తుందని అడిగినపుడు, 38 శాతం మంది కాంగ్రెస్‌ అని, 37 శాతం మంది బిజెపి అని తెలిపారు. బిజెపికి మరో మారు అవకాశమిస్తారా అని ప్రశ్నించగా 51 శాతం మంది లేదని, 41 శాతం ఔనని తెలిపారు.
‘‘సౌత్‌ ఫస్ట్‌’’ న్యూస్‌ వెబ్‌సైట్‌ కోసం పీపుల్స్‌ పల్స్‌ -సిస్రో రీసెర్చ్‌ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలిన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే, హాోరాహాోరీ పోరులో కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యత కనబడుతోంది. కర్ణాటకలో ఇప్పటికే పలు రాజకీయ పరిణామాలతో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్