కార్తి ఇంతవరకూ చేసిన సినిమాలలో ‘ఖైదీ’కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సినిమా ఆయన కెరియర్లో చెప్పుకోదగిన స్థానంలో నిలిచింది. 2019 .. అక్టోబర్ 25వ తేదీన విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. ఇది భారీ బడ్జెట్ తో తీసిన సినిమా కాదు .. పాటలు కాదుగదా, అసలు హీరోయిన్ కూడా ఉండదు. అయినా తెలుగులోను వసూళ్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. సినిమా అంతా హీరో సింగిల్ కాస్ట్యూమ్ తో మాత్రమే కనిపిస్తాడు.
చాలాకాలం తరువాత జైలు నుంచి విడుదలైన ఓ ఖైదీ, శరణాలయంలో ఉన్న తన కూతురును చూడటానికి బయల్దేరతాడు. మార్గమధ్యంలో అతను పోలీసులను కాపాడవలసి వస్తుంది. ఒక ఖైదీ .. పోలీసులను రక్షించడమనే కొత్త పాయింట్ ఆడియన్స్ కి నచ్చేసింది. అందువలన ఈ సినిమా ఇతర భాషల్లోను విజయాలను అందుకుంది. ఈ సినిమా కారణంగానే ఆ తరువాత కమల్ .. విజయ్ లాంటి హీరోలతో లోకేశ్ భారీ సినిమాలు చేయగలిగాడు. టాప్ డైరెక్టర్స్ లో ఒకరుగా చేరిపోయాడు.
అప్పటి నుంచి ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు అనే ఒక ఆసక్తిని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కార్తి తన అభిమానులతో సమావేశం కాగా, మళ్లీ ఇదే ప్రశ్న ఆయనకి ఎదురైంది. ‘ఖైదీ’ సీక్వెల్ వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళుతుందని కార్తి స్పష్టం చేశాడు. ప్రస్తుతం రజనీతో ‘కూలీ’ సినిమా చేస్తున్న లోకేశ్, ఆ తరువాత చేయనున్న ప్రాజెక్టు కార్తితోనేనన్న మాట. ‘ఖైదీ 2’లో హీరోయిన్ ఉంటుందనే ఒక టాక్ ఆడియన్స్ లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది.