Saturday, April 20, 2024
HomeTrending Newsకాళేశ్వరం ప్రాజెక్టు ఆషామాషీగా కట్టలేదు- సిఎం కెసిఆర్

కాళేశ్వరం ప్రాజెక్టు ఆషామాషీగా కట్టలేదు- సిఎం కెసిఆర్

కాళేశ్వరం ప్రాజెక్టును ఆషామాషీగా కట్టలేదని సిఎం కెసిఆర్ అన్నారు. తెలంగాణ అంతటిని సస్య శ్యామలం చేసేందుకే కాళేశ్వరం రూపకల్పన చేశామని వెల్లడించారు. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్దిగాంచిన బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని బిర్కూర్ మండలం తిమ్మాపూర్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు జరిగిన కళ్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆ తర్వాత బాన్సువాడలో జరిగిన బహిరంగసభలో సిఎం ప్రసంగిస్తూ..కాళేశ్వరం ద్వారా మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువతో నిజాంసాగర్ ఎప్పుడూ నిండుగా  ఉంటుందని, పచ్చగనే ఉంటుందని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రసంగం ముఖ్యాంశాలు

గతంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు తిమ్మాపూర్ తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయం మామూలుగా ఉండేది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ గుడిని అభివృద్ధి చేయాలని ఆలోచన చేసి ఆ దిశగా ప్రయత్నం చేశాము. పోచారం శ్రీనివాస్ రెడ్డి తన మిత్రులతో కలిసి ఈ సత్కారాన్ని పూర్తి చేశారు. వారు కోరుకున్న దాని కంటే గొప్పగా ఈ పుణ్యక్షేత్రం రూపుదిద్దుకున్నది.  ప్రజల సమగ్ర అవసరాలను తీర్చే విధంగా ఈ పుణ్య క్షేత్రం అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి ఈ రోజే 7 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నాను.

తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు మంజీర నదిపై నిజాంసాగర్ కు అనుబంధంగా దేవునూరు ప్రాజెక్టును 50 టిఎంసిల సామర్థ్యంతో తలపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాని సామర్థ్యాన్ని 30 టింఎసిలకు కుదించి సింగూరు ప్రాజెక్టును కట్టారు. నాడు మెదక్ – నిజామాబాద్ సరిహద్దులో ఉన్న సింగూరు ప్రాజెక్టు శంకుస్థాపనకు ఈ ప్రాజెక్టుతో తమకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందనే తలంపుతో నిజామాబాద్ ప్రజలే ఎక్కువగా తరలి వచ్చారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు సింగూరు నుంచి హైదరాబాద్ కు మంచినీళ్ళు అందించే పేరుతో నిజమాబాద్ లో పంటలు ఎండిన కూడా సాగునీరు అందించలేదు. ప్రతీ పంటకు ఇక్కడి ఎమ్మెల్యేలు యుద్ధం చేసేవాళ్ళు. సింగూరుపై ఆధారపడిన ఘన్ పూర్ ఆయకట్టుకు కూడా నీళ్ళివ్వకపోవడం దారుణ సమస్యగా నేను భావించాను. నాడు ఇలాంటి ఎన్నో సన్నివేశాలను చూసినం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టడానికి నన్ను ప్రేరేపించిన కారణాల్లో సింగూరు ప్రాజెక్టు కూడా ఒక ప్రబలమైన కారణం. నాడు బోధన సబ్ కలెక్టర్ గా ఉన్న నేటి ఫైనాన్స్ కార్యదర్శి రామకృష్ణా రావు బాన్సువాడ మీదుగా పోతుంటే బతికున్నప్పుడు మంచినీళ్ళు ఇచ్చి గంజి పోసైనా సరే బతికియ్యండి గానీ చచ్చిపోయాక మీరు బిర్యానీ పెట్టి లాభమేందని నాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్న మాటలను రామకృష్ణారావు నేటికీ గుర్తు చేస్తారు.

బాన్సువాడ ఇంకా అభివృద్ది చెందాల్సిన అవసరముంది. ఇక్కడి మెటర్నిటి హాస్పటల్ కి అఖిలభారత స్థాయి గుర్తింపు వచ్చింది. నెంబర్ వన్ హాస్పటల్ గా గుర్తింపు పొందింది. వయసును దృష్టిలో పెట్టుకోకుండా పోచారం శ్రీనివాస్ రెడ్డి నిరంతరం ప్రజాసేవ చేయాలని నేను కోరుతున్నాను. పోచారం శ్రీనివాస్ రెడ్డి మీద నాకు ఉండే అభిమానం వల్ల ప్రభుత్వం నుంచి రూ. 7 కోట్ల నిధులు మంజూరు చేయడంతో పాటు, సీఎం స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ నుంచి రూ. 50 కోట్లను బాన్సువాడ నియోజకవర్గానికి నేను మంజూరు చేస్తున్నాను.

RELATED ARTICLES

Most Popular

న్యూస్