Saturday, September 21, 2024
HomeTrending Newsధాన్యం సేకరణలో కెసిఆర్ విఫలం

ధాన్యం సేకరణలో కెసిఆర్ విఫలం

ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఢిల్లీలో  అన్నారు. తెలంగాణ రైతుల ఉజ్వల భవిష్యత్‌ కోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం రైతులను గందరగోళ పరుస్తున్నదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అబద్ధాలు చెబుతున్నారని, రబీ సీజనులో ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరిందని కేంద్రమంత్రి వెల్లడించారు. ఉప్పుడు బియ్యాన్ని అదనంగా తీసుకునేందుకు కూడా అంగీకరించామన్నారు. అదనంగా తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ 5 రెట్లు పెంచామని, 20 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని తీసుకునేందుకు ఒప్పందం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని కేవలం తెలంగాణకు మాత్రమే ఇచ్చామన్నారు. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన ధాన్యాన్ని తెలంగాణ ఇవ్వలేదని,  ఇప్పటికీ 14 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ ,13 లక్షల టన్నుల రా రైస్ ఇవ్వాల్సి ఉందన్నారు. నాలుగుసార్లు గడువు కూడా పొడిగించామన్నారు.

దేశంలో ఉప్పుడు బియ్యాన్ని చాలా తక్కువగా తింటారని, రా రైస్‌ ఎంత ఇచ్చినా తీసుకుంటామని ఏడాది క్రితమే చెప్పామని కేంద్రమంత్రి చెప్పారు. ఒప్పందం ప్రకారం ధాన్యాన్ని సేకరించి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని, కేంద్రంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పక్షాన ఉన్నదని స్పష్టం చేశారు. మేం గత ఐదేళ్లలో కొనాల్సిన ధాన్యం కంటే.. మూడు రెట్లు ఎక్కువే కొన్నామని, ఇచ్చే ధరను కూడా 1.5 రెట్లు పెంచి ఇచ్చామని పియూష్ గోయల్ పేర్కొన్నారు. నాలుగేళ్లకు సరిపడ బాయిల్డ్ రైస్ ఉన్నా.. రైస్ తీసుకుంటామని చెప్పామని, భవిష్యత్ లో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేసీఆర్ సంతకం చేశారని తెలిపారు.

రా రైస్‌ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే మొత్తం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, తెలంగాణ మంత్రులను ఢిల్లీకి ఆహ్వానించలేదని కేంద్రమంత్రి పేర్కొన్నారు. తాను ఢిల్లీలో లేనప్పుడు ఎందుకు వచ్చారు, ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ మంత్రులకు.. ప్రజలకు సేవ చేయడం కంటే, ఢిల్లీలో కూర్చోవడంపైనే ఆసక్తి ఉన్నదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని మానుకోవాలని పియూష్ గోయల్ హితవు పలికారు.

Also Read : కేంద్రంపై కేసీఆర్ పోరు

RELATED ARTICLES

Most Popular

న్యూస్