KCR National Politics : విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులు, పేదల వెంట పడ్డాడని ముఖ్యమంత్రి కెసిఆర్ ధ్వజమెత్తారు. నీరవ్ మోడీ, విజయ్ మాల్య లాంటి వారు లక్షల కోట్లు కుంభకోణాలు చేసిన వారికి విమానాల టికెట్లు ఇచ్చి విదేశాలకు నరేంద్ర మోడీ పంపిస్తున్నారని ఆరోపించారు. వాళ్ళు అక్కడ పిక్నిక్ చేస్తున్నార కెసిఆర్ మండిపడ్డారు. జనగామలో ఈ రోజు ముఖ్యమంత్రి కెసిఆర్ సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాలను, టి.ఆర్.ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ తనదైన శైలిలో కేంద్రంపై విమర్శలు సంధించారు. అయితే అందరు ఉహించినట్టుగా నరేంద్ర మోడీ వ్యాఖ్యల మీద ఎలాంటి కామెంట్ చేయలేదు. రేపు యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే వివిధ కార్యక్రమాల్లో కెసిఆర్ పాల్గొంటారు. రేపటి సభలో కెసిఆర్ నరేంద్ర మోడీ ని టార్గెట్ చేసే అవకాశం ఉంది.
జనగామ సభలో కెసిఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే…
రాష్ట్రంలో తాగునీటి సమస్య తీర్చేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. మిషన్ భగీరథతో ఈ రోజు తెలంగాణలో తాగునీటి సమస్య తీరింది. కరెంటు సమస్య అధికమించి వ్యవసాయం స్థిరీకరించుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయకున్నా తెలంగాణ రాష్ట్రం అన్ని వర్గాల సహకారంతో అభివృద్ధి పథంలో సాగింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొన్ని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. కరెంటు సంస్కరణల పేరుతో ప్రధాని నరేంద్ర మోడీ మోటర్లకు మీటర్లు పెట్టాలను కుట్ర చేస్తున్నాడు. నేను సచ్చినా దానికి ఒప్పుకోనని స్పష్టం చేశాను. అవసరమైతే ఢిల్లీ వరకు వస్తాం నీ సంస్కరణలు పెట్టం. నేను కొట్లాడేది నాకు పని లేక కాదు. ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వరు, కోచ్ ఫాక్టరీ ఇవ్వరు. మెడికల్ కాలేజీ ఇవ్వరు. చంద్రబాబు కూడా బావికో మీటర్ పెట్టాలని చూసిండు. ఇప్పుడు ఆ చంద్రబాబు పీడ పోయింది. పోరాడి తెలంగాణ తెచ్చుకొని ఒకటి తర్వాత ఒకటి అభివృద్ధి చేసుకున్నాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నాం.
నిన్ను పడగొట్టి మోడీ… తెలంగాణ అభివృద్ధికి సహకరించే వారిని ఎన్నుకుంటాం. దేశ అవసరాలు తీర్చేందుకు మనం అవసరమైతే ముందుకు వెళ్దాం. అవసరమైతే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాం. తెలంగాణ ప్రజలు మద్దతు ఇస్తే కడదాకా పోరాడుతాం. ఢిల్లీ కోట బద్దలు కొట్టేందుకు సిద్దంగా ఉన్నాం. జాగ్రత్త నరేంద్ర మోడీ నీ ఉడుత ఉపులు, బెదిరింపులు, పిల్లి కూతలకు భయపడే వాళ్ళం కాదు. నర్మెట్ట దగ్గర తెరాస కార్యకర్తల మీద దాడి చేశారట. జాగ్రత్త..రాష్ట్ర సాధన కోసం యుద్ధం చేసిన పార్టీ, మంచిగా ఉంటే గౌరవిస్తాం తప్పుగా వ్యవహరిస్తే గుణపాటం చెపుతాం. మా శక్తి ఉపయోగిస్తే నశం కింద నలిపేస్తాం. మేము తలచుకుంటే అడ్రెస్స్ లేకుండా పోతారని కెసిఆర్ హెచ్చరించారు.
జనగామకు వైద్య కళాశాల, స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి లో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో వీటికి జీవో జారీ చేస్తామన్నారు. దళిత బంధుకు ఈ ఏడాది మార్చ్ నెల తర్వాత ప్రతి నియోజకవర్గంలో రెండు వేల మంది చొప్పున ఎంపిక చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.