Saturday, January 18, 2025
HomeTrending Newsబీజేపీ గెలిస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 400 - కెసిఆర్

బీజేపీ గెలిస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 400 – కెసిఆర్

అబ్‌ కీ బార్‌ చార్‌ సౌ పార్‌ అని బీజేపోళ్లు గ్యాస్‌ చెబుతున్నారని.. కేంద్రంలో మళ్లీ బీజేపీ గెలిస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 400 అవుతుందని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని కామారెడ్డి నియోజకవర్గంలో బుధవారం కేసీఆర్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఈ దేశం మనది, రాష్ట్రం మనది, దయచేసి ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈసారి కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే అని తెలిపారు. బీజేపీకి 200 సీట్లు కూడా రావని పేర్కొన్నారు.

బీజేపీ ఎప్పుడైనా దోపిడీదారులు, పెట్టుబడిదారుల పార్టీయే తప్పా.. అది పేదల పార్టీ కాదని చంద్రశేఖరరావు అన్నారు. నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానిగా పది సంవత్సరాలుగా పని చేస్తున్నడు. 150 హామీలు ఇచ్చిండు. ఒక్క హామీ నెరవేరిందా? సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌ జరిగిందా? సబ్‌ కా సత్యనాశ్‌ అయ్యింది. దేశం దెబ్బతిన్నది. రూపాయి విలువ డాలర్‌తో చూసుకుంటే రూ.84 అయ్యింది. ఎగుమతులు బంద్‌ అయ్యాయి. దిగుమతులు పెరిగాయి. అచ్చేదిన్‌ రాలేదు కానీ సచ్చేదిన్‌ వచ్చింది.

ఎంతసేపు మతవిద్వేషం పెట్టాలి. ప్రజల మధ్య చిచ్చుపెట్టడం, గందరగోళం చేసుడే తప్ప.. ఏ ఒక్క మంచి పని ప్రజలకు జరిగిన పరిస్థితి లేదని కెసిఆర్ ఆరోపించారు.

కేసీఆర్‌ పోగానే కట్క బంద్‌ చేసినట్టే కరెంటు బంద్‌ అయితదా? నల్లాలు బంద్‌ అయితయా? రైతుబంధు బంద్‌ అయితదా? అని ప్రశ్నించారు. బీడీ కార్మికులకు దేశంలో ఎక్కడా ఇవ్వనట్టుగా రెండు వేల పింఛన్‌ ఇచ్చుకున్నాం అని తెలిపారు.డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయ్‌.. ఏం జరుగుతుందనేది దయచేసి ఆలోచన చేయాలని ప్రజలకు సూచించారు.

అయితే దేవుడిపై ఓట్లు.. లేకపోతే కేసీఆర్‌పై తిట్లు.. ఐదునెలలుగా ఇదే దుకాణం అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ అధినేత మండిపడ్డారు. ఎక్కడైనా తులం బంగారం వచ్చిందా? రైతుబంధు అందరికి పడ్డదా? మొన్న ముఖ్యమంత్రి 9వ తారీఖులోపల వేస్తం అన్నడు మరి వచ్చిందా? అని ప్రశ్నించగా రాలేదని జనం నినదించారు.

కేసీఆర్‌ ఉన్నప్పుడు తొమ్మిది సంవత్సరాలు రెప్పపాటు పోకుండా కరెంటు ఎంత బాగా వచ్చింది ? మరి ఇప్పుడు ఏం మాయరోగం వచ్చింది? ఎక్కడికిపోయింది మన కరెంటు ? ఇప్పుడు దానిపై ఉల్టా పల్టా మాట్లాడడమే తప్ప ఏం లేదు.

ముఖ్యమంత్రి ఏ ఊరికిపోతే ఆ ఊరి దేవుడిపై ఒట్టు వేస్తున్నడు. చేసే సిపాయి ఎవడన్న ఒట్లు పెట్టుకంటడా? ఒట్లు పెట్టుకునుడు.. కేసీఆర్‌ను తిట్లు తిట్టుడు తప్ప ఇంకో ముచ్చట లేదు. అయితే దేవునిమీద ఒట్లు. లేకపోతే కేసీఆర్‌పై తిట్లు. ఇదే కథ కదా? ఐదునెలలుగా ఇదే దుకాణమని కెసిఆర్ విమర్శించారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్