Monday, June 15, 2026
HomeTrending NewsCampaign: పల్లె పల్లెన ప్రగతి కాంతులు - ఎమ్మెల్సీ కవిత

Campaign: పల్లె పల్లెన ప్రగతి కాంతులు – ఎమ్మెల్సీ కవిత

అరవై ఏళ్ల దోపిడిని అడ్డుకొని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పల్లెలన్నీ ప్రగతిని సంతరించుకుని వెలుగులీనుతున్నాయని శాసన మండలి సభ్యులు కల్వకుంట్ల కవిత అన్నారు. తొమ్మిదేళ్ల క్రితం సమైక్య రాష్ట్రంలో నెలకొని ఉన్న దుస్థితికి, ప్రస్తుతం స్వరాష్ట్రంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమానికి గల వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని ఆమె కోరారు. బాల్కొండ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామంలో రూ. 8.25 కోట్ల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ కవిత సోమవారం రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కె.ఆర్.సురేష్ రెడ్డిలతో కలిసి శంకుస్థాపనలు చేశారు.
చౌట్పల్లి నుండి మెట్ల చిట్టాపూర్ (కరీంనగర్ సరిహద్దు)వరకు రూ. 7.48 కోట్లతో సింగిల్ లైన్ నుండి డబుల్ లైన్ బిటి రోడ్ ఏర్పాటు పనులకు, రూ. 21లక్షల అంచనా వ్యయంతో సొసైటీ గోదాం నిర్మాణానికి, రూ.6 లక్షలతో
గ్రంథాలయం భవన నిర్మాణానికి, రూ. 50 లక్షలతో లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయం ధ్వజస్తంభం నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కె.కవిత మాట్లాడుతూ…

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వానికి బాసటగా నిలుస్తూ, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ హయాంలో మారుమూల పల్లెలు సైతం సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తున్నాయని అన్ని ప్రాంతాలు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను పెంపొందిస్తూ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తుండడంతో తెలంగాణలో సంపద గణనీయంగా వృద్ధి చెందుతోందన్నారు. రైతులు సాగుచేసిన పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నూటికి నూరు శాతం నెరవేర్చడమే ముఖ్యమంత్రి నైజం అని అన్నారు.


మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ…
ఆసరా పెన్షన్ల పంపిణీతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు గౌరవం పెరిగిందన్నారు. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా అన్ని వర్గాల వారి కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధిని చూసి, పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రజలు సైతం ఇదే తరహా కార్యక్రమాలు అమలు చేయాలని, తమను తెలంగాణాలో కలపాలని కోరుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు, ప్రత్యేకించి రైతాంగం ఎంతో సంతోషంగా ఉన్నారని, ప్రభుత్వానికి మద్దతుగా పల్లెలన్నీ ఏకగ్రీవ తీర్మానాలతో మద్దతు తెలుపుతున్నాయని హర్షం వెలిబుచ్చారు.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ…
పల్లెల ప్రగతీ ధ్యేయంగా ప్రభుత్వం జనరంజక పాలన సాగిస్తోందని తెలిపారు. సరిహద్దు, మారుమూల గ్రామమైన చౌటపల్లి లో మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఒక్క గ్రామానికే అభివృద్ధి పనుల కోసం తొమ్మిదేళ్ల కాలంలో 46 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగిందని వివరించారు. ఇదే తరహాలో ప్రతి పల్లెలోనూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular