నిన్న మొన్నటి వరకు కరోనాతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రంలో ఇప్పుడు భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. నిన్న సాయంత్రం నుంచి పడుతున్నకుండపోత వానలకు చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. లక్ష్యద్వీప్ మీద ఏర్పడిన అల్పపీడనం కేరళకు ఆగ్నేయంగా కేంద్రీకృతం కావటంతో మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షానికి వృక్షాలు విరిగిపడి వాగులు, కొండలు జలసంద్రమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 105 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వర్షప్రభావ ప్రాంతాల ప్రజల్ని ఉంచారు.
కొట్టాయం జిల్లా కొట్టిక్కల్ వద్ద కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 11 చేరింది. భారత ఆర్మీ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎర్నాకుళం జిల్లాలో భారీ వర్షాల కారణంగా మువాత్తుపుజ నదిలో పెరిగిన నీటి మట్టంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తిరువనంతపురం, కొల్లాం, పథనంతిట్ట, కొట్టాయం, అలప్పుజ, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిస్సూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్‌లోని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన భారత వాతావరణ శాఖ. భారీ వర్షాల నేపథ్యంలో శబరిమల ఆలయంలో దర్శనానికి రెండు రోజులు బ్రేక్ ఇచ్చారు. కొండ చరియలు విరిగిపడి అనేక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
అటు ఉత్తరఖండ్ లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు విద్యాలయాలు, వివిధ సంస్థలకు సెలవులు ప్రకటించారు. అత్యవసర సేవలు మినహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.