సాగునీటి ప్రాజెక్టులపై సమాధానం చెప్పే ధైర్యం లేకనే ముందుగానే తమను సభనుంచి సస్పెండ్ చేశారని టిడిపి నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రశ్నోత్తరాల్లో అడిగామని, వాయిదా తీర్మానం కూడా ఇచ్చామని తెలిపారు. ఈ రెండు కాకపొతే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో నైనా నీటిపారుదల, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలు నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల అంశాలను ప్రస్తావించాలని నిర్ణయించామని.. కానీ ప్రభుత్వం తమకు అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. గట్టిగా నిలదీస్తే వారికున్న ఒకే ఒక మార్గం సభ నుంచి సస్పెండ్ చేయడమేనని ఎద్దేవా చేశారు.
ప్రశ్నించే గొంతును సస్పెండ్ చేయగలరని, కానీ సభలో అవకాశం లేకపోతే ఇతర మార్గాల ద్వారా తమ అభిప్రాయం చెబుతామన్నారు. గవర్నర్ తో సత్యదూరమైన విషయాలు చెప్పించారని నిన్ననే తాము చెప్పామని… ప్రభుత్వం అబద్ధాలు చెప్పించినందున తాము వాకౌట్ చేసి బైటకు వచ్చామన్నారు. గవర్నర్ ప్రసంగం గురించి, ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం గురించి తమకు నీతులు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. దిశా చట్టం విషయంలో కూడా ప్రభుత్వం అబద్ధాన్ని గవర్నర్ చేత చెప్పించడం ప్రజలను మోసం చేయడం కాదా అని కేశవ్ ప్రశ్నించారు.
గవర్నర్ ప్రసంగం సందర్భంగా సంప్రదాయాలను పాటించాలని మాత్రమే తాను చెప్పానని, గవర్నర్ నుంచి ఏదైనా సమాచారం వస్తే దాన్ని సభ ముందు పెట్టాలని రూల్ ఉందన్నారు. ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీ కి ఇచ్చినంత మాత్రాన ఉరి వేస్తారా? భయపడాలా? అని కేశవ్ ప్రశ్నించారు. కేసులకు, విచారణలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Also Read : గవర్నర్ కు ‘గౌరవం’పై సభలో రగడ: ఇద్దరి టిడిపి సభ్యుల సస్పెండ్