Thursday, April 25, 2024
HomeTrending Newsనా నడక నేలమీదే: సిఎం జగన్

నా నడక నేలమీదే: సిఎం జగన్

“నాకు ఇండస్ట్రీ ఎంత ముఖ్యమో వ్యవసాయం కూడా అంతే ముఖ్యం, నాకు ఐటి ఎంత ముఖ్యమో.. చిరు వ్యాపారులు, నా బీసీ, నా ఎస్సీ, కులవృత్తుల్లో ఉన్నవారు కూడా అంతే ముఖ్యం… ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ముఖ్యమో… నెల నెలా పెన్షన్ తీసుకుంటున్న అవ్వాతాతలు అంతే ముఖ్యం” అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

తమ 45 నెలల పాలనలో ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి) ద్వారా రెండు లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని, ఈ మొత్తంలో 76 శాతం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీవర్గాలకు అందించాగాలిగామని చెప్పారు. ఈ స్థాయిలో డిబిటి ద్వారా సంక్షేమం అందించిన రాష్ట్రం దేశ చరిత్రలోనే మరేదీ లేదని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా సిఎం జగన్ ప్రభుత్వ ఉద్దేశాలను, లక్ష్యాలను సభ సాక్షిగా మరోసారి కుండబద్దలు కొట్టారు. సంక్షేమం, అభివృద్ధి పథకాల ద్వారా డబ్బులు అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు, వారి బాగోగులు తమకు చాలా ముఖ్యమని… వారి సామాజిక, ఆర్ధిక, రాజకీయ, విద్య, లింగ సాధికారతలు అంతకన్నా ముఖ్యమని అన్నారు.  మంత్రి మండలిలో, నామినేటెడ్ పదవుల్లో, ఆలయ బోర్డుల్లో, మార్కెట్ కమిటీల్లో సామాజిక న్యాయంతో పాటు రాజకీయ న్యాయం కూడా కనబడుతుందని చెప్పారు. ఈ దిశగా ప్రతి అడుగూ ఒక దీక్షగా వేయగలిగామని సంతోషం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వాల్లో గాల్లో మాటలు మాట్లాడేవారని…. గ్రాఫిక్స్, మాటలు అలాగే ఉండేవని… అదిగో మైక్రో సాఫ్ట్, బిల్ గేట్స్ అని చెప్పేవారని…. కానీ “నా నడక మాత్రం నేలమీదే… నా ప్రయాణం మాత్రం సామాన్యులతోనే… పేద వర్గాలతోనే…. నా యుద్ధం పెత్తందార్లతోనే…నా లక్ష్యం పేదరిక నిర్మూలన… కాబట్టే నా ఎకనామిక్స్ వేరు” అని తేల్చి చెప్పారు. పేద కుటుంబాలు బలపడితేనే పేద కులాలు బాగుంటాయని…. వారు సాధికారత సాధించినప్పుడే సమాజం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సమాజంలోని అన్ని ప్రాంతాలనూ బలపరిస్తేనే రాష్ట్రం కూడా బాగుంటుందన్నారు. “ఇది నేను నమ్మాను, ఆచరించాను, ఫలితాలను చూపించాను… ‘ఇదే నా ఎకనామిక్స్, ఇదే నా పాలిటిక్స్, ఇదే నా తండ్రిని చూసి నేను నేర్చుకున్న హిస్టరీ…. ఇవన్నీ కలిపితేనే మీ జగన్” అని భావోద్వేగంతో వెల్లడించారు.

ఇన్ని విప్లవాత్మక మార్పులు చేసిన, ఇంతగా పేదవారికి తోడుగా ఉన్న, ఇంతగా ప్రతి కుటుంబానికి మేలు చేసిన మన ప్రభుత్వం తమదేనని, సామాజిక, మహిళా, రైతు న్యాయం అనేవి దైవ కార్యాలుగా భావించి నిబద్దతో అడుగులు వేస్తున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు ఎప్పటికీ చల్లగా ఉండాలని కోరుతున్నట్లు చెప్పారు.

Also Read : అసెంబ్లీ చూడాలంటే పాస్ లు ఇస్తాం : గుడివాడ

RELATED ARTICLES

Most Popular

న్యూస్