ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో దారుణం చోటు చేసుకున్నది. భారత జాతీయ జెండాను పట్టుకున్న భారతీయులపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడగా, 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15 రోజుల వ్యవధిలో మెల్‌బోర్న్‌లోని 3 హిందూ దేవాలయాలు వీరి చేతిలో ధ్వంసమైనట్లుగా తెలుస్తున్నది. ఇదే నేపథ్యంలో ఈ సంఘటన జరగడం మరింత ఆందోళన పెంచుతున్నది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఖలిస్తాన్ జెండా పట్టుకున్న పలువురు త్రివర్ణ పతాకాన్ని పట్టుకున్న భారతీయులపై విరుచుకుపడటం ఈ వీడియోలో చూడవచ్చు. ఖలిస్తానీ మద్దతుదారుల చేతుల్లో లాఠీలు కనిపిస్తున్నాయి. రైతుల ఉద్యమం సమయంలోనూ ఆస్ట్రేలియాలో భారత వ్యతిరేక కార్యకలాపాలను ఖలిస్తానీ మద్దతుదారులు కొనసాగించారు. ఖలిస్తాన్ మద్దతుదారులు ఎక్కువగా కెనడా, అమెరికాలో ఉన్నారు.