Ludhiana Blasts : లుధియానా కోర్టు బాంబు పేలుళ్లు వెనుక ఖలిస్తాన్ హస్తం ఉండొచ్చని, పాకిస్తాన్ మద్దతుతో ఖలిస్తాన్ మద్దతుదారులు ఈ దుర్ఘటనకు కారణమై ఉంటారని భారత నిఘా సంస్థలు అంచనాతో ఉన్నాయి. రైతు ఉద్యమం సమయంలో ఎర్రకోట పైన ఖలిస్తాన్ జెండా ఎగురవేయటం దగ్గర నుంచి ఢిల్లీ పొలిమేరల్లో ఏడాదిపాటు సాగిన రైతు ఉద్యమం వెనుక ఖలిస్తాన్ శక్తుల ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నాయి.
క్షేత్రస్థాయిలో ఖలిస్తాన్ మద్దతుదారులతో ఐ.ఎస్.ఐ. దాడి ప్రణాళిక అమలుచేసిందని దీనికి సంబంధించి పంజాబ్ పోలీసులు, నిఘా సంస్థలకు బలమైన ఆధారాలు లభించినట్టు సమాచారం. ఖలిస్తాన్ ఉద్యమాన్ని మళ్ళీ ప్రారంభించేందుకు వివిధ దేశాల్లోని సిక్కు సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు కనిపిస్తోంది. ఇటీవల గురునానక్ జయంతి సందర్భంగా అమృతసర్ స్వర్ణ దేవాలయంలో జరిగిన భక్తుల ఊరేగింపులో కొందరు ఖలిస్తాన్ జెండాలు ప్రదర్శిస్తూ కనిపించారు.
పటాన్ కోట్ ఆర్మీ కంటోన్మెంట్ వద్ద నవంబర్ లో జరిగిన గ్రెనేడ్ దాడి, డ్రోన్ ల ద్వారా పంజాబ్ లో జారవిడుస్తున్న ఆయుధాలు, పేలుడు సామాగ్రి ఇందుకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. గత అయిదు నెలల్లో పంజాబ్ పోలీసులు ఏడు టిఫిన్ బాంబులు, పది గ్రెనేడ్ లను పాకిస్తాన్ సరిహద్దు పట్టణాల్లో స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టులో ఖలిస్తాన్ నాయకుడు జర్నెయిల్ సింగ్ భింద్రన్ వాలే అల్లుడు గుర్ముఖ్ సింగ్ వద్ద పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు. అవన్నీ పాకిస్తాన్ కు చెందిన ఖలిస్తాన్ మద్దతుదారుల నుంచి లభించినట్టు విచారణలో వెల్లడైంది.
జాతీయ దర్యాప్తు సంస్థల సహకారంతో పంజాబ్ లో రౌడీషీటర్లు, ఖలిస్తాన్ బావజాల వ్యాప్తి చేస్తున్న వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. భారత్ నుంచి పంజాబ్ వేరుచేసి ఖలిస్తాన్ ప్రత్యెక దేశం ఏర్పాటు చేయాలని కొన్ని దశాబ్దాలుగా వివిధ సిక్కు సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.