పోరాటాల గడ్డ తెలంగాణలో సుపరిపాలన కొనసాగుతోందని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ సర్కారును ప్రశంసలతో ముంచెత్తారు. బీఆర్ఎస్ ఏర్పాటుతో భావసారూప్యత కలిగిన పార్టీలు ఒక్కటయ్యే అవకాశం వచ్చిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రజలకు మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జాతికి దిశానిర్దేశం చేస్తుందన్న పినరయి.. కేసీఆర్ పోరాటానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అద్భుతమన్న ఆయన.. కేసీఆర్ సర్కారు అమలు చేస్తున్న పథకాలను ప్రశంసించారు. కంటి వెలుగు స్కీం చరిత్రలో నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు.
దేశంలో రాజ్యాంగ సంక్షోభం నెలకొందని పినరయి విజయన్ అన్నారు. దేశ సమగ్రత, హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. రాష్ట్రాల అభిప్రాయాలతో సంబంధం లేకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా మోడీ పాలన సాగుతోందని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కలిసి పాలిస్తూ ప్రజల్లో విద్వేషాలు పెంచుతున్నాయని పినరయి ఆరోపించారు. రాష్ట్రాలకు రావాల్సిన నిధులు ఇవ్వకపోగా.. గవర్నర్ వ్యవస్థను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని అన్నారు.