Monday, June 15, 2026
HomeTrending NewsKIA record: 10 వేల ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్: గుడివాడ

KIA record: 10 వేల ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్: గుడివాడ

కియా ఇండియా పరిశ్రమ 10 లక్షల కార్లు ఉత్పత్తి  పూర్తిచేసుకోవడం గర్వకారణమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.  అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతంలో 15 వేల కోట్ల పెట్టుబడితో దాదాపు 20 వేల మందికి…అందులో 85 శాతం మందికిపైగా స్థానికులకు కియా కంపెనీ ఉపాధి కల్పించిందని మంత్రి కొనియాడారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవాలన్న చట్టాన్ని తమ ప్రభుత్వం తీసుకు వచ్చిందని గుర్తు చేశారు. పెనుకొండ మండలంలోని ఎర్రమంచి వద్దనున్న ‘కియా మోటార్స్’ కంపెనీ గత నాలుగేళ్లలో 10 లక్షల కార్ల ఉత్పత్తిని పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన వేడుకల్లో మంత్రులు బుగ్గన, గుడివాడ అమర్నాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

బుగ్గన మాట్లాడుతూ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద పరిశ్రమలకు సంబంధించి ఏడాదికి సగటున 13 వేల కోట్లు పెట్టబడులు వచ్చాయన్నారు. గత ప్రభుత్వంలో ఏడాదికి 11 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయన్నారు. కియా ఇండియాకు సంబంధించి ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారాన్ని  అందిస్తున్నామన్నారు. పరిశ్రమలకు, మౌలిక సదుపాయాల కల్పనకు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు  సిఎం చిత్తశుద్ధితో ఉన్నారన్నారు.

రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ కియా ఇండియా 2019 డిసెంబర్ నుంచి ఉత్పత్తి మొదలుపెట్టిన కేవలం 47 నెలల కాలంలోనే అత్యంత వేగవంతంగా 10 లక్షల కార్లను తయారు చేయడం అభినందనీయ మన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరఫున కూడా కియా సంస్థకు శుభాకాంక్షలు తెలియజేశారు.  గడిచిన నాలుగేళ్లలో దాదాపు రెండు సంవత్సరాల పాటు కోవిడ్ పరిస్థితులు ఎదుర్కొన్న సందర్భంలో కూడా కియా ఇండియాకు కావలసిన సహకారాన్ని అందించామన్నారు.  గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో కూడా సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని కియా ఇండియా ప్రతినిధులు ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అనేక పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని, హైదరాబాద్ – బెంగళూరు కేరిడార్ లో ఓర్వకల్లు వద్ద 10 వేల ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ ను  ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అక్కడ అవసరమైన నీటి సరఫరా, మౌలిక సదుపాయాల కల్పన చేపడుతున్నామని, 400 కోట్ల రూపాయలకుపైగా ఖర్చుతో నీటి సరఫరా కోసం అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతుందని, తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో పరిశ్రమలు ఏర్పాటు సంబంధించి 30 వేల కోట్ల రూపాయల క్లియరెన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి మరింత పరుగులు పెడుతుందన్నారు. కియా ఇండియా ఎక్కడికి తరలి వెళ్లదని, ఇలాంటివి అవాస్తవమని, ఇక్కడ అతి తక్కువ సమయంలో 10 లక్షల కార్ల ఉత్పత్తి ఇందుకు నిదర్శనమని, ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు పరిశ్రమకు అందిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మంగమ్మ, మాజీ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, కియా ఇండియా ఎండి & సిఈఓ టె జిన్ పార్క్, చీఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫీసర్ చోయ్ మూన్‌హీ, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్డాంగ్ లీ, ప్రొడక్షన్ సీనియర్ జనరల్ మేనేజర్ వెంకదేశన్, కియా భారతదేశ విజన్ అంబాసిడర్ సోనమ్, పిఆర్ఓ తేజస్వి బండారి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular