ఉత్తరాది రైతాంగం మళ్ళీ పోరుబాటకు సిద్దం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై దేశ రైతాంగం తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసింది. కనీస మద్దతు ధర తదితర హామీల అమలులో కేంద్రం చేసిన మోసంపై ఉద్యమ కార్యాచరణను సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ప్రకటించింది.
గణతంత్ర దినోత్సవం రోజు జనవరి 26న హర్యానాలోని జింద్ పట్టణంలో ఉత్తరాది రాష్ట్రాల రైతుల ‘కిసాన్ మహాపంచాయత్’ నిర్వహిస్తామని శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అదేవిధంగా మార్చి నెలలో దేశ రాజధాని ఢిల్లీలో ‘కిసాన్ ర్యాలీ’ నిర్వహిస్తామని, జనవరి 26న తేదీ ప్రకటిస్తామని పేర్కొన్నది. ఈ మేరకు హర్యానాలోని కర్నాల్‌లో ఎస్కేఎం నేతల భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. ఈ సమావేశానికి రాకేశ్ టికాయిత్, దర్శన్‌పాల్, జోగిందర్ సింగ్‌తో పాటు పలువురు రైతు నేతలు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే రోజున జాతీయ జెండా ఎగురవేసి, అనంతరం ప్రభుత్వ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా ట్రాకర్ల ర్యాలీలు నిర్వహించేందుకు సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొన్నదని ఎస్కేఎం తన ప్రకటనలో పేర్కొన్నది