Wednesday, March 11, 2026
HomeTrending Newsకెసిఆర్ పాలనతో తెలంగాణ సస్యశ్యామలం - తలసాని

కెసిఆర్ పాలనతో తెలంగాణ సస్యశ్యామలం – తలసాని

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా అభివృద్ధి సాధించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం PV మార్గ్ లో ని పీపుల్స్ ప్లాజా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, సంక్రాంతి పాటలతో సందడిగా మారింది. హరిదాసులకు మంత్రి సంక్రాంతి కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు పతంగులను పంపిణీ చేసిన అనంతరం మంత్రి పతంగులను ఎగుర వేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మన సంస్కృతి, సాంప్రదాయాలు చాలా గొప్పవని, దేశ, విదేశాలలో మన సాంప్రదాయాలు, ఆచారాలను ఎంతో గౌరవిస్తారని చెప్పారు. సంక్రాంతి పండుగ తెలుగు వారు ఎంతో గొప్పగా జరుపుకుంటారని అన్నారు. యువతులు, మహిళలు రంగురంగుల ముగ్గులతో ఇంటి ముంగిళ్ళను ఎంతో అందంగా అలకరిస్తారని వివరించారు. పండుగలు మన సంస్కృతిని చాటి చెప్పుతాయని పేర్కొన్నారు. మన పిల్లలకు పండుగ ప్రత్యేకతలు, సాంప్రదాయాలను తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ఏర్పడిందన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారి పంటలు విస్తారంగా పండుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో MLA దానం నాగేందర్, నగర గ్రంధాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న,BRS నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, బాలరాజ్ యాదవ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, బాక్సర్ అశోక్, జాంబాగ్ శ్రీనివాస్, కృష్ణ గౌడ్, శైలేందర్, వెంకటేష్ రాజు, లక్ష్మీపతి, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular