NZ-RSA 2nd Test: న్యూజిలాండ్- సౌతాఫ్రికా మధ్య జరుగుతోన్న రెండో టెస్ట్ రసకందాయంలో పడింది. రేపు చివరిరోజున గెలుపు కోసం న్యూజిలాండ్ 332 పరుగులు చేయాల్సి ఉంది, 6 వికెట్లు చేతిలో ఉన్నాయి.
తొలి ఇన్నింగ్స్ లో న్యూ జిలాండ్ 293 పరుగులకు ఆలౌట్ అయ్యింది, సౌతాఫ్రికా 71 పరుగుల ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 5 వికెట్లకు 140 పరుగులు చేసి… మూడోరోజు ఆట ముగిసే సమయానికి మొత్తంగా 211 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
నిన్న 22 పరుగులతో క్రీజులో ఉన్న వేర్రీన్ నేడు సెంచరీ సాధించాడు. ముల్దర్ 35, రబడ 47 పరుగులు చేశారు. 9 వికెట్లకు 354 పరుగుల వద్ద సౌతాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. వెర్రీన్ 136 పరుగులతో అజేయంగా నిలిచారు. న్యూజిలాండ్ కు మొత్తంగా 425 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. కివీస్ బౌలర్లలో సౌతీ, మాట్ హెన్రీ, జేమిసన్, వాగ్నర్ తలా రెండు; గ్రాండ్ హోమ్ ఒక వికెట్ పడగొట్టారు.
రెండో ఇన్నింగ్స్ లో కూడా కివీస్ త్వరగా వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ 1 పరుగు వద్ద ఓపెనర్ యంగ్ డకౌట్ కాగా, 6 వద్ద మరో ఓపెనర్, కెప్టెన్ లాథమ్ ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. స్కోరు 25, 81 వద్ద వరుసగా హెన్రీ నికోలస్ (7); డెరిల్ మిచెల్ (24) కూడా ఔటయ్యారు. డివాన్ కాన్వే నిలకడగా రాణించాడు. నేడు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి న్యూ జిలాండ్ రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లకు 94 పరుగులు చేసింది. కాన్వే-60; టామ్ బ్లండెల్ -1 పరుగుతో క్రీజులో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడ, కేశవ్ మహారాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
రేపు త్వరగా వికెట్లు తీసి మొదటి టెస్ట్ ఓటమికి బదులు తీర్చుకోవాలని సౌతాఫ్రికా ఉవ్విళ్ళూరుతోంది.
Also Read : కివీస్ తో రెండో టెస్ట్: సౌతాఫ్రికా లీడ్