Friday, March 13, 2026
HomeTrending Newsకోర్టుకీడుస్తాం : కొడాలి హెచ్చరిక

కోర్టుకీడుస్తాం : కొడాలి హెచ్చరిక

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేవిధంగా పిచ్చిరాతలు రాస్తే ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని, పరువునష్టం దావా వేసి కోర్టు బోనులో నిల్చోబెడతామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. జగన్ పై నేడు ఓ పత్రిక ప్రచురించిన కథనంపై నాని తీవ్రంగా మండిపడ్డారు. గత పదేళ్లుగా జగన్ వ్యక్తిత్వంపై ఇలా దాడి చేస్తూనే ఉన్నారని కానీ ఏమీ చేయలేకపోయారని ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్సార్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో కొడాలి మాట్లాడారు.

జగన్ ఎవరో ఒక మాజీ ఐఏఎస్ అధికారితో ఏదో మాట్లాడారంటూ కల్పిత వార్తను ప్రచురించారని నాని వివరించారు. రోజుకో కొత్త అబద్ధాన్ని రాసి, పదే పదే అవే అబద్ధాలను ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబును ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే ఒక పత్రిక యజమాని పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.

కనకదుర్గమ్మ, శ్రీశైలం దేవాలయాల్లో క్షుద్రపూజలు చేసిన చరిత్ర చంద్రబాబు, ఆ పత్రిక యజమాని రెండు కుటుంబాలకూ ఉందని నాని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి దేవుణ్ణి నమ్ముతారని, కానీ వీరిద్దరూ దేవుళ్ళను నమ్మకపోయినా క్షుద్రపూజలు మాత్రం చేశారని వెల్లడించారు.

చంద్రబాబు దగ్గర చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన ఐపీఎస్ ఇక్బాల్ గారు ఇప్పుడు మా పార్టీలో రెండోసారి ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారని, అలాంటి అధికారే చంద్రబాబు దగ్గర పనిచేయకుండా జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో మా పార్టీలో చేరారని గుర్తు చేశారు. మీకు సెక్యూరిటీ అధికారిగా పనిచేసిన వ్యక్తే మిమ్మల్ని నమ్మలేదని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.

జగన్ మోహన్ రెడ్డిని పదేళ్ళపాటు ఎంతగా ‘క్యారెక్టర్ అసాసినేషన్’ చేసినా తట్టుకుని నిలబడ్డారని, ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ని రాజకీయంగా ఎదుర్కోలేని చంద్రబాబు కొంతమంది మీడియా దుర్మార్గులతో కలిసి ఒక కులాన్ని రెచ్చగొడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొడాలి నాని తీవ్రంగా విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular