కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది. చివరి రెండు ఓవర్లూ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠగా సాగింది. ఓ దశలో ఢిల్లీ దే గెలుపు అనిపించింది. కోల్ కతా ఆటగాడు రాహూల్ త్రిపాఠి చివరి ఓవర్లో ఐదో బంతిని సిక్సర్ గా మలిచి జట్టుకు అద్భుతమైన విజయం అందించాడు. షార్జా వేదికగా నేడు జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్ కతా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ విసిరిన 135 పరుగుల లక్ష్యాన్ని ఛేచేదించే క్రమంలో ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన కోల్ కతా చివర్లో తడబడింది. ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో కోల్ కతాకు మ్యాచ్ చేజారిపోయే పరిస్థితి వచ్చింది.
కోల్ కతా కెప్టెన్ మోర్గాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కోల్ కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ పరుగులు రాబట్టలేకపోయింది. పృథ్వీ షా-18; శిఖర్ ధావన్-36; స్టోనిష్-18; శ్రేయాస్ అయ్యర్-30 (నాటౌట్); హెట్ మెయిర్-17 మాత్రమే రాణించారు. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లు వరుణ్ చక్రవర్తి రెండు, శివం మావి, ఫెర్గ్యుసన్ చెరోవికెట్ సాధించారు.
ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన కోల్ కతా సునాయాసంగా విజయ తీరాలకు చేరుతున్నట్లే కనిపించింది. ఓపెనర్లు శుభమన్ గిల్, వెంకటేష్ అయ్యర్ లు మొదటి వికెట్ కు 96 పరుగులు జోడించారు. అయ్యర్ 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేసి ఔటయ్యాడు, నితీష్ రానా 12 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఓపెనర్ గిల్ 46 బంతుల్లో 1ఫోర్ 1సిక్సర్ తో 46 పరుగులు చేసి ఔటయ్యాడు, ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది, కోల్ కతా ఆటగాళ్ళు దినేష్ కార్తీక్, కెప్టెన్ మోర్గాన్, షకీబ్ అల్ హసన్, సునీల్ నరేన్ నలుగురు డకౌట్ అయ్యారు. మ్యాచ్ ఢిల్లీ వైపు మళ్ళింది.
చివరి ఓవర్లో ఏడు పరుగులు కావాల్సిన దశలో మొదటి బంతికి త్రిపాఠి సింగల్ తీశాడు, రెండో బంతికి పరుగు రాలేదు, మూడో బంతికి షకీబ్, నాలుగో బంతికి నరేన్ ఔటయ్యారు. ఐదో బంతిని త్రిపాఠి సిక్సర్ చేసి ఢిల్లీ ఆశలపై నీళ్ళు చల్లాడు.
వెంకటేష్ అయ్యర్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో కోల్ కతా తలపడనుంది.