Sunday, January 19, 2025
HomeTrending Newsకొముర‌వెల్లి మ‌ల్ల‌న్న‌కు బంగారు కిరీటం

కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న‌కు బంగారు కిరీటం

రాష్ట్రంలోని అన్ని దేవాల‌యాల‌ను అభివృద్ధి చేస్తున్నామ‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని కొముర‌వెల్లి మ‌ల్లికార్జున స్వామి క‌ల్యాణోత్స‌వంలో మంత్రులు హ‌రీశ్‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌ల్లారెడ్డి, ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి పాల్గొన్నారు. కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న స్వామికి ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ట్టు వస్త్రాలతో పాటు రూ. కోటి విలువైన బంగారు కిరీటాన్ని మంత్రి హ‌రీశ్‌రావు స‌మ‌ర్పించారు.
ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. కొమురవెల్లి మల్లన్న మన కొంగు బంగారమని, రాష్ట్రానికే తలమానికం మల్లన్న జాతర అని పేర్కొన్నారు. ఇవాళ మల్లన్న స్వామివారి కల్యాణం వైభవంగా జరగడం, స్వామివారికి బంగారు కిరీట ధారణ చేయడం సంతోషంగా ఉంద‌న్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాలకు నిధులు మంజూరు చేస్తూ.. పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తెస్తున్నారని మంత్రి వెల్లడించారు.

కొముర‌వెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధికై రూ. 30 కోట్లు కేటాయించార‌ని గుర్తు చేశారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ మల్లన్న స్వామివారిని రెండుసార్లు దర్శించుకున్నారు. వచ్చే ఏడాది మల్లన్న స్వామి కల్యాణం వరకు కేతమ్మ, మేడమ్మల అమ్మవార్లకు ఒక కిలో స్వర్ణ కిరీటం తయారు చేయిస్తామని మంత్రి ప్ర‌క‌టించారు. కొందరు ఎన్ని కుట్రలు చేసిన మల్లన్న దయతో మల్లన్న సాగర్ అనుకున్న సమయానికి పూర్తి చేసుకున్నాం. మల్లన్న దేవుడి దయతో, సీఎం కేసీఆర్ కృషితో మూడేళ్లలో మల్లన్న సాగర్ పూర్తి చేసుకుని పలు జిల్లాలకు సాగునీటితో సస్యశ్యామలం చేయడం జరుగుతున్నద‌ని తెలిపారు. మల్లన్న సాగర్ ప్రారంభం చేసి గోదావరి జలలతో సీఎం కేసీఆర్ మల్లన్న పాదాలు కడిగి మొక్కులు తీర్చుకున్నార‌ని హ‌రీశ్ రావు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్