Sunday, September 8, 2024
HomeTrending NewsKothagudem: కొత్తగూడెంలో త్రిముఖ పోటీ

Kothagudem: కొత్తగూడెంలో త్రిముఖ పోటీ

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు జనరల్ స్థానాల్లో కొత్తగూడెం ఒకటి. నామినేషన్ల ఘట్టం ముగియటంతో కొత్తగూడెంలో పోటీ రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వర్ రావు, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు, జనసేన నుంచి లక్కినేని సురేందర్ రావు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా జలగం వెంకట్ రావు బరిలో ఉన్నారు.

ప్రధానంగా బీఆర్ఎస్, సిపిఐ, ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థుల మధ్యనే పోటీ కేంద్రీకృతం అయింది. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలు, సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మిదేవిపల్లి మండలాలు నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. మొత్తం ఓటర్లు సుమారు 2,40,000 ఉన్నాయి. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలు ఎటు మొగ్గితే వారిదే గెలుపు.

వనమా వెంకటేశ్వర్ రావు (బీఆర్ఎస్)

బీఆర్ఎస్ నుంచి వనమా వెంకటేశ్వర్ రావు పేరు ముందుగానే ప్రకటించటంతో ఆయన రెండు నెలల నుంచే ప్రచారంలో ఉన్నారు. భూకబ్జాలు, సెటిల్మెంట్లు తదితర ఆరోపణలు, దంపతుల ఆత్మహత్య నేపథ్యంలో వనమా కుమారుడు రాఘవ మీద ఆరోపణలతో కొంత వ్యతిరేకత ఉంది. పొత్తుల్లో భాగంగా సిపిఐకి ఇవ్వటంతో కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసి ఎడవల్లి కృష్ణ బీఆర్ఎస్లో చేరారు. అటు బిజెపి కూడా పొత్తుల్లో జనసేనకు ఇచ్చింది. ఆ అసంతృప్తితో కోనేరు చిన్ని(సత్యనారాయణ) బీఆర్ఎస్లో చేరటం వనమాకు కలిసి వచ్చే అంశం.

కొత్తగూడెం పురపాలక సంఘంలో 36 మంది కౌన్సిలర్లు ఉండగా ఇప్పుడు 30 మంది అధికార పార్టీ వారే కావటం వనమా బలంగా చెప్పుకోవాలి. ఇటీవల సిపిఐ కౌన్సిలర్లు కూడా కారు ఎక్కారు. వీరంతా వనమా గెలుపుకోసం కృషి చేస్తున్నారు. గులాబీ గుబాలిస్తేనే భవిష్యత్తు ఉంటుందని కౌన్సిలర్లు ప్రచారంలో నిమగ్నం అయ్యారు. వయోభారం రిత్యా తనకు ఇవే చివరి ఎన్నికలని వనమా ఓటర్లకు వివరిస్తున్నారు.

2009లో కాంగ్రెస్ నుంచి సిపిఐకి ఓట్ల బదిలీ పూర్తి స్థాయిలో జరిగింది. 2018 ఎన్నికల్లో సిపిఐ ఓట్లు కాంగ్రెస్ కు బదిలీ అయ్యాయి. ఇప్పటి ఎన్నికల వాతావరణం భిన్నంగా ఉందనే సమాచారం ఉంది. కాంగ్రెస్, బిజెపి నుంచి వచ్చిన నేతలు, ఎంపి వద్దిరాజు రవిచంద్ర, పార్టీ కౌన్సిలర్లు వనమా గెలుపు కోసం పాటుపడుతున్నారు. అంగ,అర్థ బలం కలిసి వచ్చే అంశం.

కూనంనేని సాంబశివరావు (సిపిఐ)

కాంగ్రెస్ ఈ సీటును పొత్తుల్లో భాగంగా సిపిఐ పార్టీకి కేటాయించింది. తీవ్ర అసంత్రుప్తిలో ఉన్న కాంగ్రెస్ నేతలు మొక్కుబడిగా ప్రచారంలో పాల్గొంటున్నారు. లోపాయికారిగా వీరంతా బీఆర్ఎస్ నేతలకు సహకరిస్తున్నారని సమాచారం. కూనంనేనికి టికెట్ ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ ఎనిమిది మంది కౌన్సిలర్లు ఎర్రజెండా వదిలేసి గులాబీతో జతకట్టడం సిపిఐకి ప్రతికూలంగా కనిపిస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు కొందరు ప్రచారంలో పాల్గొంటున్నారు. సింగరేణి కార్మికుల కాలనీల్లో ఎర్రజెండా శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.

పట్టణ  ఓటర్లు, వనమా మీద వ్యతిరేకత, కార్మికులు, ఉద్యోగుల అసంతృప్తి కలిసి వస్తుందని కూనంనేని భరోసాతో ఉన్నారు. వ్యక్తిగతంగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవటం గమనార్హం.

జలగం వెంకట రావు (ఫార్వార్డ్ బ్లాక్)

2014 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గెలుచుకున్న ఏకైక స్థానం కొత్తగూడెం కాగా…అక్కడ గెలిచిన జలగం వెంకట్ రావుకు రాజకీయం కలిసి రావటం లేదు. ఉన్న ఒక్క ఎమ్మెల్యేను కాదని కమ్మ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వర్ రావును పార్టీలో చేర్చుకొని… సిఎం కెసిఆర్ మంత్రి పదవి ఇచ్చారు. జలగం విప్ పదవితో సరిపెట్టుకున్నారు.

2018 ఎన్నికల్లో 4,139 ఓట్ల స్వల్ప తేడాతో వనమా చేతిలో ఓటమి చవి చూశారు. ఇటీవల హైకోర్టు వనమా ఎన్నిక చెల్లదని జలగంకు అనులంగా తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యే ప్రమాణం స్వీకారం చేద్దాం అనుకుంటే అనుకోని అవాంతరాలు…అదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ రావటం జరిగింది. దీంతో టికెట్ తనకే వస్తుందని ఆశపడగా సిట్టింగులకే టికెట్లు అని పార్టీ అధినేత ప్రకటించారు.

నామినేషన్ల సమయంలో తనకే అవకాశం వస్తుందని జలగం ఆశించినా నిరాశే ఎదురయింది. దీంతో ఫార్వార్డ్ బ్లాక్ నుంచి రంగంలోకి దిగారు. హంగు ఆర్భాటాలు లేకుండా ప్రచారం నిర్వహిస్తున్న జలగం ప్రచారం ప్రధాన పార్టీల అభ్యర్థులకు కునుకు పట్టనీయటం లేదు. వ్యక్తిగతంగా ఓటర్లను కలుస్తూ జలగం గతంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తున్నారు. సింహం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.

గతంలో బహుళ జాతి సంస్థలతో జాబ్ మేలా నిర్వహించటం, యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రామాలు, తాను చేసిన అభివృద్ధి జలగం గుర్తు చేస్తున్నారు. శాంతిభద్రతల వ్యవహారంలో జలగం నిక్కచ్చిగా ఉండేవారనే పేరుంది. ఎమ్మెల్యే పదవికి వనమా అనర్హుడని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రజల్లో సానుబూతిపై ఆశలు పెట్టుకున్నారు.

సింగరేణి ప్రధాన కార్యాలయం ఉన్న కొత్తగూడెంలో కార్మికులు, ఉద్యోగుల ఓట్లు కీలకం. వీరికి తోడు మున్నూరు కాపు సామాజిక వర్గం ఓట్లు సుమారు 30 వేల వరకు ఉన్నాయి. మైనారిటీల్లో సిపిఐ నుంచి వచ్చిన ఆ వర్గం నేతల ప్రభావం ఉంటుంది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు బలంగా ఉంది అవి ఎవరికి దక్కితే వారిని అదృష్టం వరించినట్టే. సాదా సీదాగా సాగుతున్న జలగం ప్రచారంతో సింహం ఎవరిపై పంజా విసురుతుందో చూడాలి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్