Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

రోజ్ గార్’ మేళా పేరుతో తాజాగా 10 లక్షల ఉద్యోగాల రిక్రూట్మెంట్ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, నిరుద్యోగ యువతీ యువకులను మరోసారి మభ్యపెట్టేందుకు మరో కొత్త నాటకానికి తెరలేపారని టియారెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటియార్ అరోపించారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువత జీవితాలతో పరిహాసమాడడం మాని చిత్తశుద్ధితో, దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని వెంటనే చేపట్టాలని ప్రధానిని డిమాండ్ చేశారు.హిమాచల్, గుజరాత్ ఎన్నికల ముందర మోడీ మరోకొత్త డ్రామ అని కెటిఅర్ విమర్శించారు.

ఈమేరకు ప్రధాని మోడీకి ఘాటైన బహిరంగ లేఖను కె.టి.రామారావు రాశారు.

కెటియార్ లేఖ సారాంశం

గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు..,

మీరు ఈ చేపట్టిన ‘రోజ్ గార్’ మేళాతో దేశ యువత సంతోషం ఎక్కువ రోజులు ఉండేది కాదని అర్ధమైంది. ఎందుకంటే, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలను నింపుతామని ప్రకటించిన మీ మాటలు నమ్మి నాటి నుంచి నేటి వరకు మీ ఎనిమిదేండ్ల పాలనలో 16 కోట్ల ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితి నేడు దేశవ్యాప్తంగా నెలకొంది. ఇట్లా ఏటేటా పెరుగుతున్న నిరుద్యోగుల ఆశలతో మరోసారి రోజ్ గార్ మేళా పేరుతో మీరు ఆటలాడడం ఏమాత్రం సరైన చర్య కాదు.

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ అని చెప్పిన మీరు, ఇప్పుడు ఆ సంఖ్యను 10 లక్షలకు కుదించారు. అంతటితో ఆగకుండా కేవలం 75 వేల మందికి మాత్రమే నియామక పత్రాల అందజేసి, అర్ధిక వ్యవస్థ అనేక కష్టాలల్లో ఉందంటూ మీరు చేసిన వ్యాఖ్యలు, ఈ రోజ్ గార్ హమీ మీద కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే కేవలం మీ పరిపాలన వైఫల్యం అడ్డగొలు అర్ధిక విధానాల వలనే దేశ అర్ధిక వ్యవస్ధ నేల చూపులు చూస్తున్నదనే విషయం మీకు గుర్తు చేస్తున్నాను. కోట్ల ఉద్యోగాలు హమీ ఇచ్చి, కేవలం వేల ఉద్యోగాలతో మీరు చేస్తున్న మీడియా ప్రచారా పటోపం, పదే పదే నిరుద్యోగ యువతతో పరిహాసం అడుతున్నట్లు ఉన్నది. ఇది కేవలం మీరు.. మీ బిజెపి పార్టీ ప్రభుత్వం నిత్యం ప్రదర్శించే ఆర్భాటపు ప్రచారమే తప్పిస్తే మరోటి కాదని మరోసారి ప్రజలకు అర్థమైంది. ఇటువంటి ఆర్భాటపు ప్రచార కార్యక్రమాన్ని నిరుద్యోగ యువతమీద రుద్దే ప్రయత్నం చేయడం దారుణం అనే విషయాన్ని నేను మీకు స్పష్టం చేయదలిచాను. ఇదే నిరుద్యోగుల భర్తీ విషయం మీద, దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీలను నింపాలని, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలని 9 జూన్ 2022 నాడు నేను మీకో బహిరంగ లేఖను రాసిన. దానికి మీనుంచి ఎటువంటి సమాధానం లేదు. రోజ్ గార్ మేళా పేరుతో కబేళాలో బలి పశువుల మాదిరి నిరుద్యోగ యువతను మరోసారి మోసం చేస్తున్నారు. మీరు ఇస్తామన్నా రెండు కోట్ల ఉద్యోగాలా హమీ మేరకు ఇప్పటిదాకా 16 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సి ఉండే కానీ, మీరు చేస్తున్న ఈ రోజ్ గార్ మోసంతో భాత్ కరోడోమే… కామ్ పకోడోమే అన్న తీరుగా మారిందన్నారు. మీరు ఇలా పదే పదే ఉద్యోగాల విషయంలో యువతను మోసం చేస్తూ మభ్యపెడుతున్న తీరుతో నమో అంటే నమ్మించి మోసం చేసేవాడు అని రుజువు అయిందన్నారు.

ఈ సందర్భంగా ఈ కింది విషయాలను మీ దృష్టికి తీసుకురాదలిచాను.

• మీ హయాంలోని బిజెపి కేంద్ర ప్రభుత్వ పాలనకు 8 ఏండ్ల కాలం దాటింది. మీరు ఇప్పటికే ప్రకటించినట్టు ఏటా 2 కోట్ల ఉద్యోగాల ప్రకారం నేటికే 16 కోట్ల ఉద్యోగాలు నింపాలి. కానీ మీ ప్రభుత్వ హయాంలో నేటివరకు మీరు భర్తీ చేసిన ఉద్యోగాలెన్నో స్పష్టం చేయగలరా? దీనిపై శ్వేత పత్రం విడుదల చేయగలరా ?

• మూడున్నర కోట్ల తెలంగాణ జనాభాకు రాష్ట్రం వచ్చిన ఎనిమిదేండ్లల్లో సూమారు 1 లక్షా 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసినం, మరో 91 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభించినం. అంటే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 2,50,000 ఉద్యోగాలకు పైగా భర్తీ చేస్తున్నపుడు,,130 కోట్ల దేశ జనాభాలో మీరు నింపిన ఉద్యోగాలెన్ని? దాని శాతమెంత ?

• ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర పరిధిలోని 2,24,000 మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినపుడు, ప్రయివేట్ రంగంలో సూమారు 16.5 లక్షల ఉద్యోగాలను ఇచ్చినప్పుడు, ఒక కేంద్ర ప్రభుత్వం తన పరిపాలనలో ఉన్న దేశంలోని 28 రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలివ్వాల్సి ఉంటదో.. మీరే చెప్పాలి?

• తెలంగాణ ప్రభుత్వం తనవంతుగా నిర్వహిస్తున్న బాధ్యతలో కేంద్రం నిర్వహిస్తున్న బాధ్యత చాలా చిన్నదని గణాంకాలే చెబుతున్నాయి. లెక్కలేస్తే మీ అసలు రంగు బయటపడుతుంది.

• దేశంలో ఏటా 2 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైరవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కనీసం ఏటా 50 వేల ఉద్యోగాలను కూడా సరిగ్గా భర్తీ చేయని మీరు, రోజ్ గార్ మేళా పేరుతో కేవలం 75 వేల మందికి నియామక పత్రాల అందచేయడాన్ని దేశ నిరుద్యోగులు గమనిస్తున్నారు?

• మీరు చేపట్టిన ప్రభుత్వ రంగ సంస్ధల అమ్మకాల పందేరం వలన సూమారు రెండున్నర లక్షల మంది ఇప్పటికే రెగ్యులర్ ఉద్యోగాలు కోల్పోయారు. ప్రభుత్వ రంగ సంస్ధలో సూమారు 50శాతం ఉన్న రిజర్వుడ్ కేటగిరిలకు చెందిన వారికి భవిష్యత్తులోనూ శాశ్వతంగా ఉద్యోగావకాశాలు దొరకకుండా పోతున్నాయి.

• లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తూ లాభాలతో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ, కార్పొరేట్లకు కట్టబెడుతున్నది మీ ప్రభుత్వం. వొకవైపు ఉద్యోగాలను తొలగిస్తూ నేడు తిరిగి ఉద్యోగ మేళా అంటే.. నిరుద్యోగులను ‘నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం’ కాదా?

• 2014 నంచి 2022 ఎనిమిది ఏండ్లలో జూన్ 2022 నాటికి కేంద్రం భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య కేవలం 7లక్షలు మాత్రమే..ఇంకా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు సూమారు 16 లక్షలున్నాయని మీ ప్రభుత్వమే చెప్పింది. ఈ నేపథ్యంలో మీరు రోజ్ గార్ మేళా ద్వారా కేవలం 75 వేల మందికి నియామక పత్రాలు అందించడం ద్వారా నిరుద్యోగులను మీరేం చేయదలుచుకున్నారు ?

• రోజ్ గార్ మేళా ప్రకటన సందర్భంగా 38 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు డిపార్ట్ మెంటుల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్టుగా మీరు ప్రకటించారు. అయితే 38 శాఖల్లో మొత్తం ఇంకా ఎన్ని ఖాళీలున్నాయో.. వాటిని ఎప్పటివరకు భర్తీ చేస్తారో స్పష్టం చేయగలరా? నిరుద్యోగుల కోసం జాతీయ జాబ్ కాలెండర్ ను మీరు విడుదల చేయగలరా ?

• ప్రభుత్వంలో ఉన్న 8 ఏండ్ల కాలంలో ఉద్యోగాలను భర్తీ చేయని మీరు.. మీ పదవీ కాలం ముగుస్తున్న సంవత్సరంన్నర కాలం ముందు తీరా ఎన్నికల రోజ్ గార్ మేళా పేరుతో తూతూ మంత్రపు వ్యవహారాలను నడపడాన్ని నిరుద్యోగుల తల్లిదండ్రులైన దేశ ప్రజలు గమనించడం లేదనుకుంటున్నారా.? దీనికి మీ సమాధానం ఏమిటి ?

• దేశవ్యాప్తంగా నిరుద్యోగం గతంలో ఎప్పుడు లేనంతగా పెరిగి రికార్డులు నమోదు చేస్తున్న నేపథ్యంలో ఈ 75 వేల ఉద్యోగాలతో రోజ్ గార్ ప్రచారం దేశ నిరుద్యోగ యువతపైన మీరు వేస్తున్న కృూర పరిహారం. మీ కంటితుడుపు చర్యను నిరుద్యోగ యువత గమనిస్తుంది. మీ రోజ్ గార్ కార్యక్రమం సముద్రంలో నీటి బొట్టు మాదిరి ఉన్నది.

ఇప్పటికైన ప్రతి ఎన్నికల ముందు ప్రజలను మోసపుచ్చే ఇలాంటి ప్రచార కార్యక్రమాలను పక్కన పెట్టి నిబద్దతతో నిరుద్యోగ సమస్యపైన దృష్టి సారించాలి. ఇచ్చిన హమీ మేరకు భారీగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేంటనే చేపట్టాలి. కేవలం మీడియా హెడ్ లైన్లు, పత్రికల్లో ప్రచారం కోసం కాకుండా నిరుద్యోగ యువతకు అవకాశం ఇచ్చేలా కేంద్రంలోని అన్ని శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ప్రతిసారి మాదిరే ఈసారి కూడా యువతను ఉద్యోగాల విషయంలో మోసం చేస్తే మీపాలనపైన, ప్రభుత్వంపైన తిరగబడే రోజు త్వరలోనే వస్తుందన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.

Also Read : హైదరాబాద్ కోసమే ఆజామాబాద్ బిల్లు – కేటిఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com