బిపర్‌జాయ్ తుఫాన్ గుజరాత్ తీరం దిశగా వెళ్తోంది. దీంతో ద్వారకలో బలమైన గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో పెద్ద ఎత్తున్న అలలు ఎగిసిపడుతున్నాయి. పోరుబందర్‌తో పాటు ద్వారక జిల్లాల్లో గాలి వేగం పుంజుకుంటున్నట్లు ఐఎండీ డైరక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ఆ జిల్లాల్లో గాలి వేగం గంటకు 75 కిలోమీటర్లు ఉన్నట్లు ఆయన చెప్పారు. గుజరాత్‌లోని కచ్ ప్రాంతంతో పాటు పాకిస్థాన్‌లోని కరాచీ తీర ప్రాంతం మధ్య బిపర్‌జాయ్ తుఫాన్ గురువారం తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తీరం వెంట ఉన్న సుమారు 8 వేల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కచ్, జామ్‌నగర్, మోర్బీ, గిర్ సోమనాథ్, పోరుబందర్, ద్వారక జిల్లాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండనున్నది. ఆ జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. గాలి వేగం కూడా శక్తివంతంగా మారే ఛాన్సు ఉన్నట్లు తెలిపారు. జూన్ 15వ తేదీన దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఆ ఈదురుగాలుల వల్ల నష్టం భారీ స్థాయిలో ఉండే ఛాన్సు ఉందని ఐఎండీ డైరెక్టర్ తెలిపారు.