Saturday, November 23, 2024
HomeTrending Newsగిన్నిస్‌ రికార్డుల్లోకి లడఖ్‌

గిన్నిస్‌ రికార్డుల్లోకి లడఖ్‌

కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌ చరిత్ర సృష్టించింది. మైనస్‌ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో గడ్డకట్టిన ప్యాంగాంగ్‌ త్సో సరస్సుపై విజయవంతంగా హాఫ్‌ మారథాన్‌ నిర్వహించి గిన్నిస్‌ రికార్డుల్లో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన (సముద్ర మట్టంపై 13,862 అడుగుల ఎత్తు) ఫ్రోజెన్‌ లేక్‌పై సక్సెస్‌ఫుల్‌గా 21 కిలోమీటర్ల హాఫ్‌ మారథాన్‌ నిర్వహించి రికార్డు నెలకొల్పింది.

భారత్‌-చైనా సరిహద్దుల్లో 700 చదురపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ప్యాంగాంగ్‌ సరస్సు విస్తరించి ఉంది. ప్రతి ఏడాది శీతాకాలంలో ఈ ఉప్పు నీటి సరస్సు ఉష్ణోగ్రత మైనస్‌ 30 డిగ్రీ సెంటీగ్రేడ్‌ వరకు పడిపోయి పూర్తిగా గడ్డకడుతుంది. కాగా, దాదాపు నాలుగు గంటలపాటు సాగిన హాఫ్‌ మారథాన్.. లుకుంగ్‌ గ్రామంలో మొదలై మాన్‌ గ్రామంలో ముగిసింది. మొత్తం 75 మంది ఈ మారథాన్‌లో పాల్గొనగా ఎవరికీ ఎలాంటి చిన్న గాయం కూడా కాకుండా పరుగు ముగిసింది.

పర్యావరణ మార్పులు, హిమాలయాల రక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ లడఖ్‌.. లడఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌, టూరిజం డిపార్టుమెంట్‌, లడఖ్‌ అండ్‌ లేహ్‌ జిల్లా పాలనా యంత్రాంగంతో కలిసి ఈ మారథాన్‌ రేసును నిర్వహించింది. గడ్డకట్టిన ప్యాంగాంగ్‌ సరస్సుపై నిర్వహించిన హాఫ్‌ మారథాన్లలో అధికారికంగా గిన్నిస్‌ రికార్డుల్లో నమోదైన తొలి మారథాన్‌ ఇదని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్