Tuesday, February 25, 2025
HomeTrending Newsపెరూలో భారీ వర్షాలు..కొండచరియలు విరిగిపడి 36 మంది మృతి

పెరూలో భారీ వర్షాలు..కొండచరియలు విరిగిపడి 36 మంది మృతి

దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ దేశంలో ఎడతెరిపి లేని వానలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. దక్షిణ పెరూలోని అరేక్విపా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి కనీసం 36 మంది మృతి చెందినట్టు జాతీయ అత్యవసర సేవ విభాగం వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా కొండ ప్రాంతాల్లో రాళ్ళు, మట్టి దిగువ ప్రాంతాల్లో పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈ ఘటనలో గాయపడ్డ 20 మందిని ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. వీరిని రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

బాధితులను ఆదుకునేందుకు హెలికాప్టర్లు, టెంట్లు, నీటి ట్యాంకులు, ఇసుక సంచులు, విపత్తు సహాయక సిబ్బంది ద్వారా  సహాయ చర్యలు చేపట్టామని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో తెలిపింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కమనా ప్రావిన్స్‌లోని సెకోచా పట్టణానికి సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో మరో ఐదుగురు గల్లంతయినట్లు అధికారులు తెలిపారు.

దక్షిణపెరూలో జరిగిన ఘటనపై అరేక్విపా గవర్నర్ రోహెల్ సాంచెజ్ స్పందిస్తూ దక్షిణ పెరూలోని నాలుగు పట్టణాల్లో వర్షాల కారణంగా పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు. అరేక్విపా అంతటా దాదాపు 12వేల మంది వర్షాప్రభావానికి లోనయ్యారని వివరించారు. ప్రతి ఏడాది ఫిబ్రవరిలో వచ్చే కుండపోత వానలకు పెరూలో ఇలాంటి ఉపద్రవాలు సంభవిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్