Bipin Rawat:
ఆర్మీ హెలికాఫ్టర్ దుర్ఘటనలో అసువులు బాసిన ఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, అయన సతీమణి మధులిత అంత్యక్రియలు ఢిల్లీ లోని బ్రార్ స్క్వేర్ స్మశాన వాటికలో పూర్తి సైనిక లాంఛనాలతో జరిగాయి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆయనకు కేంద్రం ప్రభుత్వం తరఫున తుది వీడ్కోలు పలుకుతూ పుష్పాంజలి ఘటించారు. ఫ్రంట్ ఎస్కార్ట్ గా 120 మంది త్రివిధ దళాల సభ్యులు, అంత్యక్రియల్లో 800 మంది సైనిక సిబ్బంది పాల్గొన్నారు. ఆర్మీ ఆయనకు 17 గన్ సెల్యూట్ తో వీడ్కోలు పలికింది.
కామరాజ్ మార్గ్ లోని అయన నివాసం నుంచి స్మశాన స్థలి వరకూ రోడ్డుకిరువైపులా భారీ జన సందోహం ఆయనకు ఘన నివాళి అర్పించింది. ప్రజలు పూలు జల్లుతూ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. మొన్న ఈ ప్రమాదంలో మరణించిన బిపిన్ రావత్, అయన అర్ధాంగి మధులిత తో పాటు మిగిలిన11 మంది సైనిక సిబ్బంది మృత దేహాల్ని గత రాత్రి ఢిల్లీలోని పాలెం ఎయిర్ పోర్ట్ కు తీసుకు వచ్చారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ శాఖ అధికారులు, త్రివిధ దళాల ఉన్నతాధికారులు నివాళులర్పించారు.
నేటి ఉదయం బిపిన్, మధులిత రావత్ దంపతుల బౌతిక కాయాలను కామరాజ్ మార్గ్ లోని అయన నివాసానికి తరలించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పలువురు కేంద్రమంత్రులు, వివిధ పార్టీల నేతలు, ఎంపీలు శ్రద్ధాంజలి ఘటించారు. ఫ్రెంచ్ అంబాసిడర్, బ్రిటిష్ హై కమిషనర్ తో పాటు పొరుగు దేశాలు భూటాన్, శ్రీలంక, నేపాల్ సైనిక ప్రతినినిధులు కూడా ఆయనకు ఇంటి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
Also Read : బిపిన్ రావత్ ఇక లేరు!