Saturday, January 18, 2025
HomeTrending Newsసాయుధ పోరాటంలో పీడిత వర్గాల ఊసే లేదు

సాయుధ పోరాటంలో పీడిత వర్గాల ఊసే లేదు

తెలంగాణ సాయుధ పోరాటంలో ఆరువేల మంది పోరాట యోదులు వీర మరణం పొందారు. ఈ పోరాటం తెలంగాణ సమాజాన్ని సామాజిక, సాంస్కృతిక, ప్రగతిశీల చైతన్య పథం వైపు సామాన్య ప్రజలను నాయకత్వ శక్తిగా మలిచినవి. గడ్డిపరకలు గడ్డ పారలై వెట్టి, నియతృత్వం నుండి స్వేచ్ఛను సాదించుకున్నాయి. ఈ ఉద్యమం మట్టి మనుషుల ఉద్యమం, వృత్తి కులాలు, అణగారిన వర్గాల ప్రజలే భాగస్వాములు… నాయకత్వ వైఫల్యం.. చరిత్రకారుల తప్పుడు వ్యాఖ్యానాలు, రాతలు జరగకుంటే ప్రపంచ పఠంలో తెలంగాణ సాయుధ పోరాటం ప్రజల నాయకత్వంలో సామ్యవాద శక్తిగా వెలుగుతుండేది.

సాయుధ పోరాట ఉద్యమం రాజకీయ లక్ష్యం చేరలేదు. ఎందరో అమరుల మరణాలు, వారి త్యాగాలు కనీసం రికార్డుగా కూడా సమగ్రంగా జరగలేదు. దీనికి ప్రధాన కారణం నాయకత్వంలో ఆదిపత్య పోరు. గ్రూపు తగాదాల వల్ల అదికారంలోకి రావలసిన ప్రజాస్వామిక రాజకీయ శక్తులు అదికారంలోకి రాలేకపోయాయి. ఆంధ్ర- తెలంగాణ నాయకత్వ పోరు.. విబేధాలతో ఆంధ్ర ప్రాంతం నేతలు వెళ్లిపోయారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొందరు నాయకులు తిరిగి వచ్చారు. అంటే ఆనాటి నాయకత్వ పోరు సమస్య తీవ్రత ఎంతటిదో తెలుస్తుంది.

దీనికి ప్రధాన కారణం భూమి సమస్య. 1948లో సాయుధ పోరాటం విరమించాలా  వద్ద అన్న మీమాంస కమ్యూనిస్టు పార్టీల్లో విబేధాల వల్ల ఒక వర్గం విరమించడం మరో వర్గం కొనసాగించడం వల్ల ప్రజలు గందరగోళానికి గురయ్యారు. అధికారంలోకి రావలసిన శక్తులు అమాయకత్వంతో అప్పనంగా ఖద్దరు టోపి పెట్టుకున్న ఊర్ల నుండి పారిపోయిన భూస్వాములకు అదికారం అప్పగించారు.

ముఖ్యంగా ఈ పోరాటంలో అసువులు బాసిన పీడిత వర్గాల త్యాగాలను కీర్తించిన వారు లేరు. చరిత్రలో వారి ఊసే లేదు. ఆరు వేలమంది పోరాట యోధులు వీరమరణం పొందినా.. వారి త్యాగలకు గౌరవ స్మారక చిహ్నం లేకుండా పోయింది. ఈ ఉద్యమాన్ని రాజకీయ లబ్ది కోసం కొన్ని పార్టీలు వాడకోవడం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నవి. ముఖ్యంగా ఆనాటి తెలంగాణ సమాజం సాయుధ పోరాటం నేర్పిన స్పూర్తితో అన్నీ రంగాల్లో చైతన్యం పొందారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధులు అందించిన పోరాట అవశేషాల చైతన్య నినాధం ఉమ్మడి ఆంద్రప్రదేశ్ పాలనలో వివక్షకు గురైన తెలంగాణ రాష్ట్ర ప్రజలు మారోమారు వివక్ష నుండి తనను తాను ప్రక్షాళన చేసుకొంది. ఆత్మ గౌరవ నినాధం చాటుకొని 2014 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగింది.
దోపిడీ పీడనను తెలంగాణ సమాజం ఎన్నడు సహించలేదు. అందుకు ఉదాహరణ వీర తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. దోపిడీ అవశేషాలు తుదముట్టించేందుకు 1975 నక్సలైట్ ఉద్యమంతోపాటు వీరోచిత వామపక్ష ఉద్యమం 1990 నుండి అణగారిన హక్కుల ఉద్యమాలు 2001 నుండి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాజకీయ ఉద్యమం ఉధృతంగా మారి తెలంగాణ రాష్ట్ర సాధన అవతరణ ఏర్పాటు వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజల వీరోచిత పోరాటాలకు నిత్య చైతన్య స్రవంతికి నిదర్శనం.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినా.. సాయుధ పోరాటంలో బడుగు, బలహీన వర్గాల స్థానం, త్యాగాలు రికార్డులకు ఎక్కలేదు. రాష్ట్రంలో జనాభా పరంగా ఒక శాతం కూడా లేని వర్గాలే చరిత్రను తిరగరాస్తూ… తమకు అనుకూలంగా నిర్వచిస్తున్నాయి.

తెలంగాణ సాయుధ పోరాటంలో బడుగు బలహీన వర్గాలు వేల సంఖ్యలో అసువులు బాశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో బలిదానాల నుంచి ఉద్యమంలో లాఠీ దెబ్బల నుంచి జైలు పాలైన వారిలో అణగారిన వార్గాలే అధికం. రెండు సందర్భాల్లో ఆయా వర్గాలకు జరగాల్సిన న్యాయం జరగలేదనే అపవాదు ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఫలాలు రెండు మూడు సామాజిక వర్గాలకే దక్కటం స్పష్టంగా అవగతం అవుతోంది.

తెలంగాణ ప్రజా సమూహానికి ఉన్న గొప్ప లక్షణం మంచిని తలకెత్తుకొని ఊరేగుతారు. తెలంగాణ ప్రజలు నిత్య చైతన్య కరదీపికలు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఘటనలు, పీడిత వర్గాల పాత్ర… జమిందారుల ఆగడాలు.. రజాకార్ల తొత్తులుగా గడీల్లో జరిగిన ఆకృత్యాల వెలికితీతకు… తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో రెండు మూడు కులాల పెత్తనం తొలగించి… నయా భూస్వామ్య వర్గాల దోపిడీని అరికట్టి.. అన్ని వర్గాలకు అవకాశాల కోసం మరో సాంస్కృతిక సాయుధ పోరాటం చేయాల్సిన రోజు ఇంకా మిగిలే ఉంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్