చాలామంది విజయం సాధించిన మహిళలను లేదా కేవలం వారి విజయాలకు సంబంధించిన అంశాలు మాత్రమే అడుగుతూ ఉంటారు.
ఈ జీవితంలో మనకి ఎదురయ్యే ఏ అనుభవమైనా … తప్పులు, విజయాలు, సంతోషాలు, బాధలు … ఇలా ప్రతి ఒక్కటీ మనని తీర్చిదిద్ది ఈరోజు మనమున్న స్థాయికి తీసుకొస్తాయి. మన విజయాలు మాత్రమే మనని నిర్వచిస్తాయనుకుంటే పొరపాటు. మన కష్టాలు, పోరాడిన విధానం, నేర్చుకున్న పాఠాలు, వాటన్నిటి ఫలితంగా అలవడిన మనో ధైర్యం మనని ప్రపంచానికి పరిచయం చేస్తాయి. మనసుకు తగిలే దెబ్బలు మానవత్వం పెంపొందేలా చేస్తే , సవాళ్లు ఏ పరిస్థితినైనా తట్టుకునే స్థైర్యం ఇస్తాయి. ఎటు వెళ్తున్నామో తెలియకుండా వేసే అడుగులు సత్యాన్వేషణకు దగ్గర చేస్తాయి.

జీవితానుభవాలు మనని ఒక్కో దశలో ఒక్కోలా మలుస్తూ ఉంటాయి. సందేహంగా ఉండే అమ్మాయి, భయపడుతూ జీవించే మహిళ, ఎదురైన కష్టాలు… వీటన్నిటి నుంచి ఎదుగుతూ ఉంటాం. అలా ఎదుగుతూ, తగిలే దెబ్బలనుంచి కోలుకుంటూ సజీవ గాథలుగా నిలుస్తాం. అందుకే మన ఈ ప్రయాణాన్ని అందమైన అనుభూతులతో మాత్రమే కాక చేదు వాస్తవాలతో కూడా సాగిద్దాం. చేదు లేకపోతే తీపి విలువ తెలియదు. అలాగే కఠినమైన పరిస్థితులు ఎదురయ్యాకే ఇంతటి ధైర్యం, సాహసం కలబోసిన మహిళగా నిలబడ్డారని మరచిపోకూడదు కదా! విజయం సాధించిన ప్రతి మహిళకూ చెప్పడానికి ఎన్నో విషయాలు ఉంటాయి.
మన జీవితమొక పెద్ద రంగురంగుల వర్ణచిత్రం అనుకుంటే,అందులో ఎన్నో రకాల రంగులు ఉంటాయి. ఒక్కో రంగు ఒక్కో అనుభవానికి సూచిక గా నిలుస్తుంది. అలాగని రంగులొక్కటే మన అనుభవాలకు నిదర్శనాలు కాదు, వాటిని చూసే కళ్ళని బట్టి కూడా ఉంటుంది.

ఇద్దరు వ్యక్తులు ఒకే చోట నుంచున్నా వారు చూసే దృక్పథం వేరుగా ఉండచ్చు. అదంతా మన మానసిక స్థితి, నమ్మకాలు, అనుభూతులపై ఆధారపడి ఉంటుంది.
అదే మనం చాలా ఓపెన్ గా వాస్తవికంగా, ఆర్ద్రత తో జీవితాన్ని గమనిస్తే ఇంకా ఎన్నో విషయాలు తెలుస్తాయి .
మన దృక్పథమే జీవితాలను సరయిన దిశగా అర్థవంతంగా తీర్చిదిద్దుతుంది. అందుకు అనువైన రంగులను మనమే ఎంచుకుని చిత్రించుకోవాలి.

