ముంబై లో జన జీవనం క్రమంగా కుదుట పడుతోంది. ఐదు దశల లాక్ డౌన్ నిభందనల్ని మహారాష్ట్ర ప్రభుత్వం సడలిస్తోంది. ఈ రోజు నుంచి మహా నగరంలో సిటీబస్ లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కోవిడ్ నిభందనలు పాటిస్తూ బస్సులు నడిపేందుకు బృహన్ ముంబై ఎలక్ట్రిక్ అండ్ ట్రాన్స్ పోర్ట్ – బెస్ట్(BEST) సంస్థను అనుమతించారు.
తాజాగా ముంబై లోకల్ రైళ్ళ రాకపోకలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే వారం నుంచి లోకల్ రైళ్ళు ప్రజలకు అందుబాటులో ఉంటాయని ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్ ఈ రోజు వెల్లడించారు. ఇప్పటివరకు లోకల్ రైళ్ళు అత్యవసర సేవల కోసమే వినియోగిస్తున్నామన్నారు. కోవిడ్ పరిస్థితులు సమీక్షించి వచ్చే వారం అందరు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని మేయర్ వివరించారు.
రెస్టారెంట్స్, దుకాణాలు నడుపుకునేందుకు ఇప్పటికే BMC (బృహన్ ముంబై కార్పొరేషన్) అనుమతించింది. సాయంత్రం నాలుగు గంటల వరకు 50 శాతం సీటింగ్ తో నడపాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సందర్శన కోసం కాలనీ పార్కులు కూడా ఓపెన్ అయ్యాయి. దీంతో మార్కెట్లు, రోడ్లు కొంత సందడిగా మారాయి. మల్టిప్లెక్స్, సినిమా థియేటర్ లు, భారీ మాల్స్ కు మాత్రం ప్రభుత్వం ఇంకా పర్మీషన్ ఇవ్వలేదు.
కోవిడ్ నిభందనల సడలింపు, ఆంక్షలు విధించటం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దావ్ థాకరే జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ నిభందనలు పాటించని సంస్థలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం థాకరే స్పష్టం చేశారు.