Friday, November 22, 2024
HomeTrending Newsలోక్ సభ మూడో దశ ఎన్నికలు

లోక్ సభ మూడో దశ ఎన్నికలు

మూడో దశలో మొత్తం 94 లోక్‌సభ నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి రెండు గంటల్లోనే సుమారు 11 శాతం పోలింగ్ నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా గాంధీ నగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూడో విడత పోలింగ్‌ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోలింగ్‌ ప్రారంభమైన తొలి గంటలోనే ఓటు వేశారు. గుజరాత్‌ రాష్ట్రం గాంధీనగర్‌ పరిధిలోని అహ్మదాబాద్‌లో ఉన్న నిషాన్‌ హైస్కూల్‌లో ప్రధాని మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

గాంధీనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి అమిత్‌ షా సైతం తన కుటుంబంతో కలిసి అహ్మదాబాద్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీమణి సోనాల్‌ షా, కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జైషా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు.

గుజరాత్ లోని మొత్తం 26 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా గాంధీ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్రమంత్రులు పురుషోత్తం రూపాల(రాజ్ కోట్), మన్సుఖ్ మండవియ(పోరుబందర్)లో బరిలో ఉన్నారు. రాజ్ పుత్ లను అవమానించే విధంగా పురుషోత్తం రూపాల వ్యాఖ్యలు చేశారని ఆ వర్గం నేతలు గుర్రుగా ఉన్నారు.

పోలీసులు – మావోల పరస్పర కాల్పులతో దద్దరిల్లిన ఛత్తీస్ ఘడ్ లో ఏడు స్థానాలకు జరగుతున్న వాటితో ఈ రాష్ట్రంలో ఎన్నికల తంతు ముగుస్తుంది. అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, దాద్రనగర్ హావేలి, డామన్ డయ్యు, గుజరాత్, గోవా, జమ్మూకశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యుపి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పలు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఉత్తరప్రదేశ్ లోని సంభల్, హత్రాస్, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, ఫిరోజాబాద్, మెయిన్‌పురి, ఎటా, బదౌన్, ఆమ్లా, బరేలీ నియోజకవర్గాలు ఉన్నాయి. మెయిన్‌పురిలో మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ బరిలో ఉన్నారు.

మధ్యప్రదేశ్‌లోని బేతుల్ నియోజకవర్గానికి రెండో దశలోనే జరగాల్సి ఉన్నా BSP అభ్యర్థి మృతి చెందడంతో మూడో దశకు మార్చాల్సి వచ్చింది. గుణ నుంచి జ్యోతిరాదిత్య సింధియా, మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్(విదిష), దిగ్విజయ్ సింగ్(రాజ్ ఘడ్) తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

మహారాష్ట్రలో అందరి దృష్టి ఆకరిశిస్తున్న బరమతి నియోజకవర్గంలో వదిన మరదళ్ళు (సునేత్ర పవార్, సుప్రియ సులే) ప్రజాతీర్పు కోసం చెమటోడుస్తున్నారు.

ఎన్నికలు ఏప్రిల్ 17 నుంచి మొత్తం ఏడు దశల్లో జరగనున్నాయి. కౌంటింగ్ జూన్ 4న ఉంటుంది. ఇంతకు ముందే తొలి రెండు దశల ఎన్నికల నోటిఫికేషన్ విడులైంది. నాలుగో దశలో భాగంగా ఏపీలో మే 13న ఎన్నికలు నిర్వహిస్తారు. దీనికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్