ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలిపై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు తేదీలు ఖరారు చేశారు. ఆగస్ట్ 8, 9, 10 తేదీల్లో మూడు రోజులపాటు చర్చకు కేటాయించారు. మణిపూర్ ఓ జరుగుతున్న అల్లర్లపై ప్రధాని పార్లమెంట్ లో స్వయంగా ప్రకటన చేయాలని, సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఉభయ సభల్లో కార్యకలాపాలను అడ్డుకుంటూ వస్తున్నారు.
ఇటీవలే ఏర్పాటైన విపక్షాల కూడమి ‘ఇండియా’ తరఫున కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గోగోయ్ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. దీన్ని పరిగణన లోకి తీసుకున్నట్లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించిన సంగతి తెలిసిందే. బిర్లా నేతృత్వంలో నేడు బిఏసి సమావేశం జరిగింది, దీనిలో అవిశాసం చర్చ తేదీలు ఖరారు చేశారు. సుదీర్ఘ చర్చ అనంతరం మూడోరోజు ఆగస్ట్ 10న ప్రధాని మోడీ సమాధానం ఇవ్వనున్నారు. కాగా, మణిపూర్ అంశంపై వెంటనే చర్చ చేపట్టాలంటూ భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) సభ్యులు బిఏసి సమావేశం బహిష్కరించారు.