Sunday, January 19, 2025
HomeTrending Newsమత్స్యకారులను ఆదుకుంటాం : లోకేశ్‌

మత్స్యకారులను ఆదుకుంటాం : లోకేశ్‌

మత్స్య కారులకు ఈ ప్రభుత్వం నిలిపివేసిన సంక్షేమ పథకాలన్నీ మరో రెండునెలల్లో తాము అధికారంలోకి రాగానే  తిరిగి అందిస్తామని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. అవసరమైన చోట ఫిషింగ్ హార్బర్ లను నిర్మిస్తామని, వాటిలో కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.   నరసన్నపేటలో తెదేపా శంఖారావం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్రను విజసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి దోచుకుంటున్నారని ఆరోపించారు. భూకబ్జాలు చేస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారని విమర్శించారు. సంపూర్ణ మద్య నిషేధమని హామీ ఇచ్చి దాన్ని నిలుపుకోకుండా సరికొత్త బ్రాండ్‌లను తీసుకొచ్చి.. మద్యం తయారీ, విక్రయం వాళ్లే చేస్తూ జనం డబ్బు లాగేస్తున్నారని మండిపడ్డారు.

”151 సీట్లు గెలిచి జగన్‌ రాష్ట్రానికి ఏం సాధించారు? ఎమ్మెల్యేల బదిలీ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఒక నియోజకవర్గంలో పనిచేయని వారు మరో నియోజకవర్గంలో పని చేస్తారా? ఎమ్మెల్యేల బదిలీ తీసుకొచ్చినప్పుడే జగన్‌ ఓటమిని అంగీకరించారు. దిల్లీలో ఉన్న వైకాపా ఎంపీలు కూడా ఆయనకు బైబై అంటున్నారు. వంద సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్‌ కట్‌ చేశారు. రాబోయేది తెదేపా-జనసేన ప్రభుత్వం. 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. ఉద్యోగం ఆలస్యమైతే నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు అందజేస్తాం. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కానీయం. అవసరమైతే ఆంధ్ర రాష్ట్రమే ఉక్కు పరిశ్రమను కొనుగోలు చేస్తుంది. అవినీతి ఆరోపణలపై సమాధానం చెప్పేందుకు జగన్‌ సిద్ధంగా ఉన్నారా?” అని లోకేశ్‌ ప్రశ్నించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్