ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ మంత్రి నారాయణలు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో రేపు అక్టోబర్ 4న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని లోకేష్, నారాయణలకు ఏపీ సిఐడి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
రేపటి విచారణకు తాను హాజరుకాలేనని.. 60 ఏళ్ల వయసులో తాను సిఐడి వారి వద్దకు రాలేనని, తన దగ్గరకే వచ్చి విచారణ జరపాలని,నాలుగైదు రోజులు గడువు కూడా ఇవ్వాలని నారాయణ తన పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు.
కాగా లోకేష్ కూడా పిటిషన్ దాఖలు చేస్తూ తనకు ఇచ్చిన 41 ఏ నోటీసులో పేర్కొన్న నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హెరిటేజ్ సంస్థ అకౌంట్స్ పుస్తకాలు, తీర్మానాలను తీసుకు రావాలంటూ ఆదేశించడాన్ని తప్పు బట్టారు. తాను ఆ సంస్థలో ఇప్పుడు డైరెక్టర్ గా లేనని అలాంటప్పుడు వారి అకౌంట్ బుక్స్ తనకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం మరో పిటిషన్ కూడా లోకేష్ దాఖలు చేశారు.
ఈ మధ్యాహ్నం లంచ్ తరువాత ఈ పిటిషన్లు విచారణకు రానున్నాయి.