కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారం పూర్తి కావడంతో ఏపీ ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారంపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఎల్లుండి జూన్ 12న గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ ప్రాంగణంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. దీనికోసం అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారనేదానిపై ఇప్పుడు అందరి ఆసక్తి నెలకొని ఉంది.
కూటమిగా పోటీ చేసిన మూడు పార్టీలకూ మంత్రివర్గంలో భాగస్వామ్యం ఉంటుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నట్లు నిన్న ఓ జాతీయ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆయన హోం శాఖను కోరుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం 25 మందికి మంత్రివర్గంలో అవకాశం ఉండగా, జనసేనకు 4, బిజెపికి 2 బెర్త్ లు కల్పిస్తారని తెలుస్తోంది. జన సేన నుంచి పవన్ తో పాటు కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధ ప్రసాద్, నాదెండ్ల మనోహర్, రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ల నుంచి మిగిలిన ముగ్గురుని ఎంపిక చేస్తారని సమాచారం. ఒక వేల నాలుగు ఇవ్వడం కుదరకపోతే స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. బిజెపి నుంచి సుజనా చౌదరికి పదవి ఖాయం కాగా , మరో పదవికి విష్ణు కుమార్ రాజు, సత్య కుమార్, కామినేని శ్రీనివాస్ ల పేర్లు వినబడుతున్నాయి. కమ్మ సామాజిక వర్గం నుంచి సుజనాకు ఇస్తారు కాబట్టి కామినేనికి ఈసారి అమాత్య యోగం లేనట్లే!
ఇక ప్రధానంగా తెలుగుదేశం విషయానికి వస్తే కొంతకాలంవరకూ మంత్రివర్గానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న లోకేష్ పార్టీ వర్గాల నుంచి వచ్చిన ఒత్తికి కారణంగా మనసు మార్చుకుని కేబినేట్ లో చేరేందుకు సిద్దమయ్యారు. పార్టీలో మూడు, నాలుగు దశాబ్దాలుగా ఉంటూ ఎన్నోసార్లు మంత్రి పదవులు చేపట్టిన వారిని ఈసారి పార్టీకే పరిమితం చేయాలని లోకేష్ భావిస్తున్నారట. వారి అనుభవాన్ని అటు పార్టీ, ఇటు ప్రభుత్వానికి పరోక్షంగా వినియోగించుకోవాలని… యువతరానికి, క్షేత్ర స్థాయిలో చురుగ్గా పనిచేయగేలిగే వారికే చోటు ఇవ్వాలని పట్టుబడుతున్నారట. కేంద్రమంత్రివర్గంలో కూడా రామ్మోహన్ నాయుడు, పెమ్మసానిలకు అవకాశం ఇచ్చారు. అదే ఫార్ములా రాష్ట్రంలో కూడా ఉంటుందని లోకేష్ సన్నిహితులు చెబుతున్నారు. కిమిడి కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస్, యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి సీనియర్లను పక్కన పెడతారని వినిపిస్తోంది. టిడిపి నుంచే 135 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఎమ్మెల్సీలుగా ఉన్నవారు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. వీరిలోనుంచి… మిత్రపక్షాలకు పోను మిగిలిన 19 ఖాళీలకు ఎంపిక చేయడం ఓ పెద్ద టాస్క్ అనే చెప్పాలి. రాబోయే కాలంలో పార్టీ సారధ్యం చేపట్టేందుకు లోకేష్ కు మార్గం సుగమం చేసేలా మంత్రివర్గంలో కూడా ఆయన సూచించిన వారికే పెద్దపీట వేసేందుకే బాబు కూడా మొగ్గు చూపుతున్నారట. అందుకే కేబినేట్ లో యంగ్ టీమ్ ను రంగంలోకి దించుతారని, గతంలో లాగా ఎలాంటి మొహమాటాలకూ తావులేకుండా.. చివరి నిమిషం వరకూ సాగదీసేధోరణికి స్వస్తి పలికి మొత్తం కేబినెట్ ఒకేసారి భర్తీ చేయాలనే భావనలో బాబు, లోకేష్ లు ఉన్నారని తెలుస్తోంది.
ఈ ఉదయమే ఢిల్లీ నుంచి అమరావతి చేరుకున్న చంద్రబాబు ఈ సాయంత్రం నుంచి మంత్రివర్గ కూర్పుపై దృష్టి పెట్టనున్నారు. బిజెపి కేంద్ర నాయకత్వంతో పాటు… ఈ రాత్రి లేదా రేపు ఉదయం జనసేనాని పవన్ తో కూడా సమావేశమై రేపు సాయంత్రానికి పేర్లు ఖరారు చేసే అవకాశం ఉంది.