ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు కోసం బిజెపి పార్టీ శ్రేణుల్ని సమాయాత్తం చేస్తోంది. ఢిల్లీలో రెండు రోజులుగా జరుగుతున్న పార్టీ అత్యున్నత సమావేశాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో జరుగుతున్న సమావేశాల్లో ఉత్తరప్రదేశ్ బిజెపి ఎంపీలు పాల్గొన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు ఉన్న దృష్ట్యా ఇప్పటి నుంచి పార్టీ ఎంపీలు తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని అధిష్టానం సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు లబ్దిదారులకు చేరేలా చొరవ తీసుకోవాలని కమలం పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ ఎంపీలు అందరు రాబోయే ఎన్నికల వరకు తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ కార్యక్రమాలే కాకుండా ప్రజా సేవ లక్ష్యంగా ప్రజల్లో ఉండాలని సూచించినట్టు ఉన్నావ్ ఎంపి సాక్షి మహారాజ్ వెల్లడించారు.
ఈ సమావేశాల్లో బిజెపి జాతీయ అధ్యక్షుడు జయ ప్రకాష్ నడ్డ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లతో పాటు పార్టీ యుపి శాఖ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పూరి, స్మృతి ఇరాని పాల్గొన్నారు.