లడఖ్, కశ్మీర్ రాష్ట్రాలు కనిష్ఠ ఉష్ణోగ్రతలతో గజగజ వణికిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అతిశీతలంగా మారాయి. లడాఖ్‌లోని ద్రాస్ పట్టణంలో ఈ రోజు (మంగళవారం) మైనస్ 29 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. లోయల్లో కోల్డ్ వేవ్ కొనసాగుతున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. శ్రీనగర్ తో పాటు సమీప ప్రాంతాల్లో నల్లాలు గడ్డకట్టుకు పోయాయి. దీంతో కాశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ కింద ఏర్పాటు చేసిన అత్యాధునిక నల్లాల ద్వారా మాత్రమే తాగు నీటి సరఫరా జరుగుతోంది. రాబోయే 24 గంటల్లో జమ్మూలో ఆకాశం క్లియర్‌గా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
లడాఖ్‌లో మైనస్ 29 డిగ్రీలు
శ్రీనగర్‌లో మైనస్ 2.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. పహల్గామ్‌లో మైనస్ 11.8, గుల్‌మార్గ్‌లో మైనస్ 11.5 డిగ్రీలు నమోదు అయ్యాయి. కార్గిల్‌లో మైనస్ 20.9, లేహ్‌లో మైనస్ 15.6 డిగ్రీలు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ రోజు 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.