Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఐపీఎల్: హైదరాబాద్ కు రెండో ఓటమి

ఐపీఎల్: హైదరాబాద్ కు రెండో ఓటమి

Lucknow won: ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై లక్నో సూపర్ జెయింట్స్ 12 పరుగులతో విజయం సాధించింది. జాసన్ హోల్డర్, ఆవేష్ ఖాన్ లు చివర్లో అద్భుతంగా బౌల్ చేసి లక్నోకు విజయాన్ని అందించారు.

నవీ ముంబైలోని డా. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లక్నో 27 పరుగులకే మూడు కీలక వికెట్లు (డికాక్-1; ఎవిన్ లూయీస్-1; మనీష్ పాండే-11) కోల్పోయింది. అయితే గత మ్యాచ్ లలో విఫలమైన కెప్టెన్ కెఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లో రాణించి, దీపక్ హుడాతో కలిసి నాలుగో వికెట్ కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. హుడా 33 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో 51; రాహూల్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 68 పరుగులు చేసి ఔటయ్యారు. అయూష్ బదోనీ 19 పరుగులతో రాణించాడు. నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్లకు 169 పరుగులు చేసింది.  హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, షెఫర్డ్, నటరాజన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

తర్వాత హైదరాబాద్ 25 పరుగులకు తొలి వికెట్ (కెప్టెన్ విలియమ్సన్-16) కోల్పోయింది. కాసేపటికే మరో ఓపెనర్ అభిషేక్ వర్మ(13) కూడా పెవిలియన్ చేరాడు. రాహుల్ త్రిపాఠి 30 బంతుల్లో 5ఫోర్లు, ఒక సిక్సర్ తో  44, మార్ క్రమ్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. నికోలస్ పూరణ్- వాషింగ్టన్ సుందర్ లు నిలదొక్కుకుని ఆడుతున్నసమయంలో అవేష్ వేసిన 18వ ఓవర్లో పూరన్, ఆ తర్వాతి బంతికే అబ్దుల్ సమద్ ఔటయ్యారు. సుందర్ (18); రోమానియో షెఫర్డ్ (8) పరుగులకే అవుట్ కావడంతో హైదరాబాద్ ఓటమి ఖరారైంది, 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేయగలిగింది.

లక్నో బౌలింగ్ లో ఆవేష్ ఖాన్ నాలుగు, హోల్డర్ మూడు, క్రునాల్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టారు.

ఆవేష్ ఖాన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

Also Read : ఐపీఎల్: చెన్నైపై పంజాబ్ విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్