Tuesday, January 21, 2025
HomeTrending Newsబ్రెజిల్‌ అధ్యక్షుడిగా లూలా డిసిల్వా ప్రమాణ స్వీకారం

బ్రెజిల్‌ అధ్యక్షుడిగా లూలా డిసిల్వా ప్రమాణ స్వీకారం

లాటిన్‌ అమెరికా వామపక్ష శక్తుల్లో కొత్త ఉత్సాహం నింపిన, మితవాద, సామ్రాజ్యవాద శక్తులకు పెద్ద సవాలు విసిన బ్రెజిల్‌ వర్కర్స్‌ పార్టీ నేత లూలా డిసిల్వా మూడవసారి బ్రెజిల్‌ అధ్యక్ష పదవిని స్వీకరించారు. ఇలా మూడు సార్లు అధికారంలోకి రావటం ఒక రికార్డు.  నియంత్వ పోకడలకు తెరలేపిన అధ్యక్షుడు జైర్‌ బోల్సనారో మీద అక్టోబరు 30న జరిగిన తుది విడత పోరులో లూలా స్వల్ప మెజారిటీతో గెలిచారు. లూలాకు 50.9శాతం రాగా బోల్సనారోకు 49.1శాతం వచ్చాయి. దేశంలో అణగారిన తరగతులు- ధనికులుగా, మితవాదులు – పురోగామి వాదులుగా చీలిన రెండు వర్గాల మధ్య సమీకరణలు ఎంత తీవ్రంగా ఉన్నదీ స్పష్టం. ఓటమిని అంగీరించేందుకు మొరాయించిన బోల్సనారో చివరి వరకు ఎన్నికలను వమ్ము చేసేందుకు, మిలిటరీ తిరుగుబాటును రెచ్చగొట్టేందుకు చూశాడు. మొత్తం మీద మిలిటరీ అందుకు సిద్దం గాకపోవటంతో విధిలేక అధికార మార్పిడికి అంగీకరించాడు. ఆ తతంగానికి హాజరు కాకుండా రెండు రోజుల ముందే తన పరివారంతో సహా అమెరికా వెళ్లాడు. జనవరి 30వ తేదీ వరకు అక్కడ ఉంటారని చెబుతున్నప్పటికీ గడువులోగా తిరిగి స్వదేశానికి వస్తాడా రాడా అన్నది చూడాల్సి ఉంది. తనకు జైలు, చావు లేదా తిరిగి అధికారానికి రావటం రాసిపెట్టి ఉందంటూ మద్దతుదార్లను రెచ్చగొట్టాడు.

లక్షలాది మంది అభిమానుల హర్షధ్వానాల మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించిన లూలాకు పార్లమెంటులో మెజారిటీగా ఉన్న మితవాదులు ఎంత మేరకు సహకరించేదీ చూడాల్సి ఉంది. పదవీ స్వీకారం తరువాత లూలా మాట్లాడుతూ తమకు ఎవరి మీదా ప్రతీకారం తీర్చుకోవాలని లేదని, అంత మాత్రాన తప్పు చేసిన వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు. చట్టబద్దమైన పద్దతుల్లోనే తాము చేసిన తప్పిదాలకు సమాధానం చెప్పుకోవాలన్నారు. వైరి పక్షాల సమీకరణలు తీవ్రంగా ఉన్నందున మూడవసారి పాలనా పగ్గాలు చేపట్టిన లూలాకు గతంలో మాదిరి పాలన సజావుగా సాగే అవకాశాలు లేవని అనేక మంది పరిశీలకులు చెబుతున్నారు. తొలిసారి అధికారం చేపట్టినపుడు ఉన్న ఆర్థిక పరిస్థితులకు ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. ప్రపంచమంతటా వస్తువులకు పెరిగిన డిమాండ్‌ కారణంగా గతంలో లూలా అనేక సంక్షేమ పధకాలను అమలు జరిపి కోట్లాది మంది జీవితాలను మెరుగుపరిచారు. ఆ కారణంగానే లూలా అధికారం నుంచి తప్పుకున్న నాటికి జనంలో 83శాతం మద్దతు ఉంది. ఇప్పుడు అంతలేదని ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. ఇప్పుడు అమలు జరపనున్న విధానాలను బట్టి జనం స్పందిస్తారు. ఇటీవలి కాలంలో బ్రెజిల్‌ రెండుసార్లు తీవ్ర ఆర్థిక వడిదుడుకులను ఎదుర్కొన్నది.

అమెజాన్‌ అడవులను అక్రమంగా ధ్వంసం చేస్తున్నవారిని అరికడతానని లూలా ప్రకటించారు. గత ప్రభుత్వం జారీ చేసిన అనేక ఉత్తర్వులు, నిర్ణయాలను రద్దు చేస్తూ తొలి రోజే సంతకాలు చేశారు. నెల రోజుల్లో గత నాలుగు సంవత్సరాల్లో జరిగిన అనేక అంశాలను తనకు నివేదించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్